Anantapur District: సైబర్ నేరగాళ్ల బారినపడి, డీఎస్పీ చేతిలో అవమానపడి .. అనంతపురం ఎస్పీకి లేఖ రాసి అదృశ్యమైన ఆర్ఎంపీ!

Anantapur RMP writes letter to SP and went missing
  • లక్కీ డ్రా పేరుతో వల విసిరిన సైబర్ నేరగాళ్లు
  • రూ. 15 లక్షలు మోసపోయిన ఆర్ఎంపీ
  • పోయిన డబ్బులు రావని, పోయి అడుక్కుతినండంటూ డీఎస్పీ తిట్టారంటూ లేఖ   
  • బాధితుడు హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తింపు
  • కోల్‌కతాలో ఉన్న సైబర్ నేరగాడి కోసం వెళ్లిన పోలీసులు
సైబర్ నేరగాళ్ల బారినపడి మోసపోయిన ఓ ఆర్ఎంపీ పోలీసులను ఆశ్రయిస్తే పోయిన డబ్బులు తిరిగి రావని చెప్పారు. పోలీసుల తీరుతో మనస్తాపం చెందిన ఆయన ఎస్పీకి లేఖ రాసి అదృశ్యమయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కొండాపురానికి చెందిన ఆర్ఎంపీ జి.వెంకటేశ్‌‌కు లక్కీ డ్రా పేరుతో వల విసిరిన సైబర్ నేరగాళ్లు అతడి నుంచి రూ. 15 లక్షలు కాజేశారు. 

చివరికి మోసపోయానని గ్రహించిన వెంకటేశ్ పోలీసులను ఆశ్రయించారు. అయితే వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఈ నెల 19న ‘స్పందన’ కార్యక్రమలో ఎస్పీకి తన బాధ చెప్పుకున్నారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. ఆయన ఆదేశాలతో పుట్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా ఈ నెల 22న తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఎదుట వెంకటేశ్ హాజరయ్యారు.

ఆ తర్వాత ఎస్పీకి వెంకటేశ్ లేఖ రాస్తూ.. డీఎస్పీ తనను అవమానించారని ఆరోపించారు. తన గురువైన మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌ను కూడా డీఎస్పీ కించపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, పోయిన డబ్బులు తిరిగి రావని, పోయి అడుక్కుతినండంటూ తిట్టారని పేర్కొన్నారు. డీఎస్పీ తన ఇంటికి వస్తానని, తన భార్యతో కలిసి భోజనం చేద్దామని అన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరిన ఆయన ఆ తర్వాత అదృశ్యమయ్యారు. దీంతో వెంకటేశ్‌ను వెతికేందుకు రంగంలోకి దిగిన పోలీసులు అతను హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించారు. 

మరోవైపు, వెంకటేశ్‌ను మోసం చేసిన సైబర్ నేరగాడు కోల్‌కతాలో ఉన్నట్టు తెలుసుకుని పోలీసులు నిన్న కోల్‌కతా వెళ్లారు. రూ. 2.50 లక్షల వరకు రికవరీ చేసి బాధిత కుటుంబానికి అందించామని, నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం మిగతా సొమ్మును కూడా రికవరీ చేసి బాధిత కుటుంబానికి అందజేస్తామని పుట్లూరు ఎస్సై గురుప్రసాద్ తెలిపారు.
Anantapur District
Cyber Crime
RMP
Andhra Pradesh

More Telugu News