జగనన్న చేయూత కార్యక్రమం టెంటు తాళ్లను శివలింగానికి కట్టిన వైనం... మండిపడిన సోము వీర్రాజు

25-09-2022 Sun 17:54
  • బిక్కవోలులో జగనన్న చేయూత కార్యక్రమం
  • ఆలయం పక్కనే కార్యక్రమం ఏర్పాటు
  • హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న సోము వీర్రాజు
  • పాపం పండే రోజు వస్తుందన్న టీడీపీ
Somu Veerraju fires on Jagananna Cheyutha program tent ropes being tied to a Shiva Lingam
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో జగనన్న చేయూత కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన టెంటు తాళ్లను పక్కనే గుడిలో ఉన్న శివలింగానికి కట్టిన వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు మండిపడ్డారు. 

జగనన్న చేయూత కార్యక్రమ ఏర్పాట్లలో అతి పురాతనమైన గోలింగేశ్వరస్వామి వారి దేవాలయంలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించారని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హిందూ వ్యతిరేక చర్యలకు వత్తాసు పలికే ప్రభుత్వానికి అధికారులు తలొగ్గకుండా దోషులను శిక్షించాలని బీజేపీ కోరుతోందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయన పంచుకున్నారు.

అటు, తెలుగుదేశం పార్టీ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో దీనిపై ఘాటుగా స్పందించింది. ఒళ్లు కొవ్వెక్కి కొట్టుకుంటున్న ఈ పాపాత్ముల పాపం పండే రోజు త్వరలోనే వస్తుందని పేర్కొంది.