కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై సంయమనంతో మాట్లాడండి: పార్టీ అధికార ప్రతినిధులకు హైకమాండ్ స్పష్టీకరణ

23-09-2022 Fri 15:26
  • కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్
  • రేసులోకి దిగుతున్న శశిథరూర్
  • బాహాటంగా విమర్శించిన గౌరవ్ వల్లభ్
  • తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్
Congress high command issues guidelines for party spokespersons over presidential election
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తమ అధికార ప్రతినిధులకు పలు సూచనలు చేసింది. పార్టీ అధ్యక్ష ఎన్నికపై ఎక్కువగా మాట్లాడవద్దని స్పష్టం చేసింది. సంయమనంతో వ్యవహరించాలని పేర్కొంది. 

ముఖ్యంగా, అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నేతలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలు, ప్రాధాన్యతలు ఉన్నప్పటికీ, పార్టీ పరంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొంది. 

కాంగ్రెస్ చీఫ్ పదవికి ఎంపీ శశిథరూర్ కూడా రేసులో ఉండగా, ఆయనపై కాంగ్రెస్ పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గౌరవ్ వల్లభ్ వంటి నేతలు బహిరంగంగానే శశిథరూర్ ను విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కారణంగానే పార్టీ అధికార ప్రతినిధులను ఉద్దేశించి పై వ్యాఖ్యలు చేసింది. 

ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్చార్జి జైరాం రమేశ్ పార్టీ అధికార ప్రతినిధులకు, ఇతర కార్యవర్గ నేతలకు స్పష్టమైన సందేశం పంపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబరు 17న జరగనుండగా, 19న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.