YS Vivekananda Reddy: వివేకా హత్య కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సునీతారెడ్డి పిటిషన్... సుప్రీంకోర్టు నోటీసులు

  • 2019లో వైఎస్ వివేకా హత్య
  • ఇప్పటికీ కొనసాగుతున్న విచారణ
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన వివేకా కుమార్తె
  • తెలంగాణ హైకోర్టు పరిధిలో విచారణ కోరుతూ పిటిషన్
Sunitha Reddy approaches Supreme Court seeking YS Viveka murder case probe transfer

మూడేళ్ల కిందట మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగ్గా, ఇప్పటికీ ఆ కేసు ఓ కొలిక్కిరాలేదు. ఈ నేపథ్యంలో, వివేకా హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఏపీలో ఈ కేసు విచారణకు అనుకూల పరిస్థితులు లేవని ఆమె నివేదించారు. సీబీఐ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదని సునీత ఆరోపించారు. అదే సమయంలో సాక్షులను బెదిరిస్తున్నారని, కడపలో అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆమె తన పిటిషన్ లో వివరించారు. అందుకే ఈ కేసు తదుపరి విచారణను ఏపీ హైకోర్టు పరిధిలో కాకుండా, తెలంగాణ హైకోర్టు పరిధిలో జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె సుప్రీంకోర్టును అభ్యర్థించారు. 

ఈ పిటిషన్ పై జస్టిస్ ఎమ్మార్ షా, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన సుప్రీం ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. సునీతారెడ్డి తరఫున న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు.

వివేకా హత్య కేసు విచారణ ఎలాంటి పురోగతికి నోచుకోని పరిస్థితి ఏర్పడిందని కోర్టుకు వివరించారు. విచారణకు తోడ్పాటు అందించాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ... దిగువస్థాయి పోలీసు యంత్రాంగం కానీ, ప్రభుత్వ అధికార వర్గాలు కానీ సహకరించడంలేదని తెలిపారు. నిందితులు ఒక్కొక్కరూ బెయిల్ పై బయటికి వస్తూ, సాక్షులను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.

వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.... సీబీఐకి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 14కి వాయిదా వేసింది.

More Telugu News