మారువేషాల్లో తిరుగుతూ.. రెండున్నర దశాబ్దాల నాటి కేసును ఛేదించిన పోలీసులు

19-09-2022 Mon 07:59
  • 1997లో హత్యకు గురైన కిషన్‌లాల్
  • నిందితుడిని అన్‌ట్రేసబుల్‌గా ప్రకటించిన కోర్టు
  • 2021లో ప్రత్యేక బృందానికి కేసు అప్పగింత
  • ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా, ఆటో కంపెనీ ప్రతినిధులుగా వేషాలు మార్చిన పోలీసులు
  • ఎట్టకేలకు నిందితుడిని కటకటాల వెనక్కి పంపిన వైనం
Delhi Police Unearth 25 years back mystery muder case
మారువేషాల్లో తిరుగుతూ 25 ఏళ్ల నాటి హత్యకేసును ఛేదించిన ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు, ఫొటోలు, సమాచారం, ప్రత్యక్ష సాక్షులు లేకున్నా కేసును ఛేదించిన పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని తుగ్లకాబాద్‌లో నివసించే కిషన్‌లాల్ 1997లో హత్యకు గురయ్యాడు. ఈ కేసు విచారణ చేపట్టిన పాటియాలా హౌస్‌కోర్టు అనుమానితుడైన రామును అన్‌ట్రేసబుల్‌గా ప్రకటించడంతో కేసు మరుగున పడిపోయింది. దీంతో కేసు కథ ముగిసిపోయినట్టేనని అందరూ భావించారు.

అయితే, 2021లో ఈ కేసును పాత కేసుల పరిష్కారంపై శిక్షణ పొందిన పోలీసు బృందానికి అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... ఇన్సూరెన్స్ ఏజెంట్ల అవతారం ఎత్తారు. గతంలో మృతి చెందిన వారి బంధువులకు నగదు సాయం చేస్తున్నట్టు చెప్పి ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో రాము బంధువును గుర్తించారు. అతడి సాయంతో ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లా ఖాన్‌పూర్‌ గ్రామానికి చేరుకుని, అక్కడ మరికొందరు బంధువులను కలిశారు. ఈ క్రమంలో నిందితుడైన రాము కుమారుడు ఆకాశ్ ఫోన్ నంబరు సంపాదించారు. అనంతరం అతడి ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించి దాని సాయంతో అతడు లక్నోలోని కపుర్తలాలో ఉంటున్నట్టు తెలుసుకున్నారు.

అక్కడికి వెళ్లిన పోలీసులు ఆకాశ్‌ను కలిసి తండ్రి గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో నిందితుడు రాము తన పేరును అశోక్ యాదవ్‌గా మార్చుకున్నట్టు గుర్తించారు. తాను ఏడాదిగా తండ్రిని కలవలేదని, కాకపోతే ఆయన లక్నోలోని జానకీపురంలో ఆటో నడుపుతున్నట్టు మాత్రం తనకు తెలుసని చెప్పాడు. అతడి కోసం తాము వెతుకుతున్న విషయం తెలిస్తే తప్పించుకునే అవకాశం ఉండడంతో పోలీసులు ఈసారి వేషాలు మార్చారు. తాము ఆటో కంపెనీ ప్రతినిధులమని, కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా కొత్త ఆటోల కొనుగోలుకు రాయితీలు ఇస్తున్నట్టు చెబుతూ జానకీపురంలోని పలువురు ఆటో డ్రైవర్లను కలిశారు. ఈ క్రమంలో ఓ డ్రైవర్ ఈ నెల 14న స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో నివసిస్తున్న రాము అలియాస్ అశోక్ యాదవ్ వద్దకు అండర్ కవర్‌లో ఉన్న పోలీసులను తీసుకెళ్లాడు.

అక్కడ రామును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, తాను రామును కాదని, తానెప్పుడూ ఢిల్లీ వెళ్లలేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. దీంతో అతడి బంధువులను పిలిపించడంతో అతడి రంగు బయటపడింది. వారందరూ అతడిని రాముగానే గుర్తించారు. దీంతో అతడికి నేరాన్ని అంగీకరించక తప్పలేదు. చిట్‌ఫండ్ డబ్బుల కోసమే కిషన్‌లాల్‌ను హత్యచేసినట్టు చెప్పాడు. ఆ తర్వాత యూపీ వెళ్లి లక్నోలో స్థిరపడ్డానని, అశోక్ యాదవ్ పేరుతో ఆధార్ సహా ఇతర గుర్తింపు కార్డులను పొందినట్టు చెప్పాడు. 25 ఏళ్లనాటి కేసును పరిష్కరించిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు ప్రశంసించారు.