CM KCR: తొమ్మిదేళ్లుగా తమ కుమార్తెకు పేరుపెట్టని దంపతులు... వారి కల నెరవేర్చిన సీఎం కేసీఆర్

CM KCR christened a girl child after nine years she born
  • తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సురేశ్, అనిత
  • 2013లో వారికి ఆడబిడ్డ జననం
  • కేసీఆరే నామకరణం చేయాలని భావించిన దంపతులు
  • వారి విషయం కేసీఆర్ కు తెలియజేసిన మధుసూదనాచారి
పుట్టిన బిడ్డకు ఆర్నెల్ల లోపే పేరుపెడతారని తెలిసిందే. కానీ తెలంగాణకు చెందిన ఈ దంపతులు తమ కుమార్తెకు 9 సంవత్సరాల వరకు పేరు పెట్టకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అందుకు బలమైన కారణమే ఉంది. 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా నందిగామ గ్రామానికి చెందిన సురేశ్, అనిత దంపతులు. వీరిద్దరూ తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించారు. వీరికి 2013లో ఓ కుమార్తె జన్మించింది. అయితే, ఆ బాలికకు సీఎం కేసీఆర్ తో నామకరణం చేయించాలన్నది వారి కల. ఆ బాలికకు ఇప్పటిదాకా పేరు పెట్టకుండానే నెట్టుకొచ్చారు. అయితే వారి కల ఇన్నాళ్లకు ఫలించింది.

బాలిక నామకరణం విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇది విని సీఎం కేసీఆర్ ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఆ దంపతులను ప్రగతి భవన్ కు ఆహ్వానించారు. 

ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఆ దంపతులను, వారి కుమార్తెను ప్రగతి భవన్ కు తీసుకువచ్చారు. వారికి సీఎం కేసీఆర్ దంపతులు సాదరంగా స్వాగతం పలికారు. వారి కుమార్తెకు సీఎం కేసీఆర్ 'మహతి' అని నామకరణం చేసి ఆశీస్సులు అందించారు. సురేశ్, అనిత దంపతులకు కొత్త బట్టలు పెట్టారు. అంతేకాదు, మహతి విద్యాభ్యాసం కోసం ఆర్థికసాయం కూడా అందజేశారు. 

తమ కల తొమ్మిదేళ్ల తర్వాత నెరవేరడం పట్ల సురేశ్, అనిత దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. సీఎం కేసీఆర్ దంపతులకు వేనోళ్ల కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
CM KCR
Christen
Mahathi
Telangana Movement
Suresh
Anitha
Jayashankar Bhupalpally District

More Telugu News