nia: ఉగ్రమూలాల సమాచారంతో తెలుగు రాష్ట్రాల్లోని 23 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు.. ముగ్గురి అరెస్ట్!

  • పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకుల ఇళ్ల తనిఖీ
  • ఆదిలాబాద్, నిజామాబాద్, భైంసా, కరీంనగర్, జగిత్యాలలో దాడులు
  • ఏపీలోని నెల్లూరు, కర్నూలు, కడప, గుంటూరులో సోదాలు
NIA conducts raids 23 locations in Andhra Pradesh and Telangana

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆదివారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో 23 చోట్ల ఎన్ఐఏ సోదాలు చేస్తుండటం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.  పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) నాయకులు, సానుభూతిపరుల నివాసాలు, షాపులు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. సామాజిక సేవ ముసుగులో శిక్షణ ఇస్తూ యువతను ఉగ్రవాద కార్యక్రమాలవైపు మళ్లిస్తున్నారన్న అభియోగాలతో పీఎఫ్ఐ నేతల నివాసాల్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్,  కరీంనగర్, జగిత్యాల, భైంసాతో పాటు ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంతో పాటు కర్నూలు, కడప, గుంటూరులో సోదాలు నిర్వహిస్తున్నారు. 

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఎంఎస్ ఫారంలో షేక్ ముఖిద్ ఇంటిని జల్లెడ పట్టిన ఎన్ఐఏ అధికారులు అతని బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలపై వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. అతని పాస్ పోర్టు సీజ్ చేసి, బ్యాంక్ పాస్ బుక్ లను తీసుకెళ్లారు. హైదరాబాద్ లోని ఎన్ఐఏ కార్యాలయానికి రావాలని నోటీసులు ఇచ్చారు. జగిత్యాల జిల్లా  కేంద్రంలోని టీఆర్ నగర్ లోని నాలుగు ఇళ్లతో పాటు, ఓ మెడికల్ షాపులో సోదాలు చేశారు. ఇందులో ఒకరి ఇంట్లో డైరీతో పాటు పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

నిర్మల్ జిల్లా భైంసాలోని మదీనా కాలనీలో సోదాలు చేసిన తర్వాత ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. భైంసాలో తరచూ అల్లర్లు జరుగుతుండడంతో ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. వీరికి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో తనిఖీల తర్వాత ఓ అనుమానితున్ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఉగ్రమూలాల సమాచారంతో ఏపీలోని బుచ్చిరెడ్డిపాలెం ఖాజా నగర్ ఇలియజ్ అనే వ్యక్తితో పాటు అతని స్నేహితుల ఇళ్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

More Telugu News