Brahmotsavams: తిరుమలలో అన్ని ప్రాంతాల్లో దొంగల ఫొటోలు... బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు

  • ఈ నెల 27 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
  • భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించిన తిరుపతి ఎస్పీ
  • గరుడ సేవకు అదనపు బలగాలు
  • తిరుమల వ్యాప్తంగా సీసీ కెమెరాలు
  • టీటీడీ అనుబంధ ఆలయాల వద్ద కూడా భద్రత
Huge security arrangements for Tirumala Brahmotsavams

ఈ నెల 27 నుంచి అక్టోబరు 5 వరకు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుపనున్నారు. దీనికి సంబంధించిన భద్రతా అంశాలపై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి నేడు సమీక్ష నిర్వహించారు. రెండేళ్ల తర్వాత భక్తుల నడుమ నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. 

బ్రహ్మోత్సవాలకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తారని, ఈ సందర్భంగా చోరీలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే, దొంగతనాలను అరికట్టేందుకు, ముందుగా అంతర్రాష్ట్ర దొంగలను గుర్తించి వారి ఫొటోలను తిరుమలలో అన్ని ప్రాంతాల్లో కనబడే విధంగా ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. మాడ వీధులు, గ్యాలరీలు, క్యూ లైన్ల వద్ద ఎగ్జిట్ ఎంట్రీలను పటిష్ఠం చేసి, తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. 

ఇక, బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు విపరీతమైన రద్దీ ఉంటుందని, అందుకే గరుడ సేవ రోజున అదనపు బలగాలను మోహరిస్తామని తెలిపారు. గరుడ సేవ రద్దీని దృష్టిలో ఉంచుకుని, అనువైన పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి, లైటింగ్ సదుపాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. 

అంతేకాకుండా, బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ అనుబంధ ఆలయాల వద్ద కూడా భద్రతను పటిష్ఠం చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.

More Telugu News