అమిత్ షా వీటి గురించి మాట్లాడాలి: ఎమ్మెల్సీ క‌విత‌

17-09-2022 Sat 13:50
  • స‌మైక్య‌త ఉత్స‌వాలను బీజేపీ హైజాక్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోప‌ణ 
    స్వాతంత్య్రం, తెలంగాణ ఉద్య‌మాల్లో బీజేపీ నేత‌ల‌ పాత్ర ఏమిటో చెప్పాల‌ని ప్ర‌శ్న‌
    హైద‌రాబాద్‌లో పోటాపోటీగా బీజేపీ, టీఆర్ఎస్ కార్య‌క్ర‌మాలు 
MLC Kavita questions Amit shah
టీఆర్ఎస్‌, బీజేపీ హైద‌రాబాద్‌లో ఈ రోజు పోటాపోటీ వేడుక‌లు నిర్వ‌హిస్తున్నాయి. టీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో జాతీయ సమైక్యత దినోత్సవం జ‌రుగుతుండ‌గా.. బీజేపీ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని చేప‌ట్టింది. రెండు కార్య‌క్ర‌మాల్లో ఇరు పార్టీలు ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు చేయ‌డంతో రాజ‌కీయాలు వేడెక్కాయి. ఈ క్ర‌మంలో బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.  బీజేపీ త‌మ‌కు అలవాటైన "ఎన్నికల ఉత్సవాలు" అన్న సహజ సూత్రాన్ని ఇక్క‌డా అమ‌లు చేసి తెలంగాణ‌లో హైద‌రాబాద్ స‌మైక్య‌త దినోత్స‌వాలను హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 

రాష్ట్రాలకువచ్చి హామీలివ్వడం, ప్రజలు వారిని తిరస్కరించగానే, వంచించడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆమె ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న‌, బీజేపీ కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల‌న్నారు. స్వాతంత్ర్యోద్యమంలో మీ పాత్ర ఏమిటి?  హైదరాబాద్ సమైక్య ఉద్యమంలో బీజేపీ నేత‌ల పాత్ర ఉందా? తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏమిటో చెప్పాలంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నాస్త్రాలు సంధించారు. తెలంగాణ బిడ్డ‌గా వీటికి స‌మాధానాలు తెలుసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు ట్వీట్ చేశారు.