తెలంగాణ‌కు మ‌ళ్లీ వ‌ర్ష సూచ‌న‌

17-09-2022 Sat 10:48
  • నేడు, రేపు తేలిక‌పాటి వ‌ర్షాలు కురిసే అవ‌కాశం
  • బంగాళాఖాతంలో అల్ప‌పీడనం ఏర్పడవ‌చ్చ‌న్న వాతావ‌ర‌ణ శాఖ‌
  • గ‌త వారం హైద‌రాబాద్ తో పాటు రాష్ట్రం అంత‌టా కురిసిన వ‌ర్షాలు
Light rains likely to lash Hyderabad over the weekend
తెలంగాణను వ‌ర్షాలు మ‌రోసారి ప‌లుక‌రించ‌నున్నాయి. స్వల్ప విరామం త‌ర్వాత హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌ళ్లీ వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయి. శ‌ని, ఆదివారాల్లో నగ‌రంలో వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర రాజధానిలో ఆదివారం ఉదయం వరకు తేలికపాటి (2.50 మి.మీ నుంచి 15.50 మి.మీ మధ్య) వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆదివారం నాటికి వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో, తదుపరి 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంద‌ని  అంచ‌నా వేసింది.

దీంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని సహా దాదాపు అన్ని జిల్లాల్లో వారాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్ర‌క‌టించింది. కాగా, శుక్ర‌వారం కూడా హైద‌రాబాద్ లో ప‌లు ప్రాంతాల్లో కొద్ది పాటి వ‌ర్షం కురిసింది. మారేడ్‌పల్లిలో 4.5 మిమీ వర్షపాతం నమోదు కాగా, శేరిలింగంపల్లిలో 2.3 మిమీ వర్షపాతం నమోదైందని వాతావ‌ర‌ణ కేంద్రం పేర్కొంది. గ‌త వారం ఎడ‌తెరిపి లేకుండా కురిసిన వ‌ర్షాల‌కు హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఇబ్బందుల‌కు గుర‌య్యారు.