చీతాలు వచ్చేశాయ్!. గ్వాలియర్‌లో ల్యాండైన ‘చీతా’ విమానం

17-09-2022 Sat 09:13
  • నమీబియా నుంచి 8 చీతాలను తీసుకొచ్చిన విమానం
  • గ్వాలియర్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన అధికారులు
  • మధ్యప్రదేశ్‌కు ఇంతకు మించిన గొప్ప బహుమతి మరోటి లేదన్న సీఎం చౌహాన్
  • చీతాలను కునో నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టనున్న ప్రధాని
8 Nambian cheetahs land at Gwalior airport
నమీబియా నుంచి 8 చీతాల (చిరుతపులులలో అరుదైన రకం)తో బయలుదేరిన బోయింగ్ విమానం బి747 జంబోజెట్ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ల్యాండైంది. చీతాలను తీసుకొచ్చేందుకు విమానాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దిన అధికారులు దాని ముఖాన్ని ‘చీతా’ బొమ్మతో అందంగా తీర్చిదిద్దారు. ల్యాండైన విమానానికి అధికారులు స్వాగతం పలికారు. భూమ్మీద అత్యంత వేగవంతమైన జంతువుగా రికార్డులకెక్కిన ఈ చీతాలు మన దేశంలో 1952లో అంతరించిపోయాయి. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఇవి భారత గడ్డపై కాలు మోపాయి. 

చీతాలను ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘ప్రాజెక్టు చీతా’ ప్రపంచంలోనే తొలి అతిపెద్ద ఖండాంతర ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్టు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ.. నమీబియా నుంచి కునో నేషనల్ పార్క్‌కు చీతాలు రావడానికి మించిన గొప్ప బహుమతి మధ్యప్రదేశ్‌కు మరోటి లేదని అన్నారు. ఇది చారిత్రాత్మకమని, ఈ శతాబ్దంలోనే ఇది అతిపెద్ద వన్యప్రాణుల ఘటన అని పేర్కొన్నారు. చీతాల రాకతో మధ్యప్రదేశ్ పర్యాటకానికి ఊపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఎనిమిది చీతాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కునో నేషనల్ పార్క్‌లో ప్రవేశపెడతారు.