Gudivada Amarnath: చంద్రబాబు గత జన్మలో తాను కులీకుతుబ్ షాను అనుకుంటున్నాడు: మంత్రి గుడివాడ అమర్ నాథ్ సెటైర్లు

  • ఏపీ అసెంబ్లీలో పారిశ్రామికాభివృద్ధిపై చర్చ
  • ప్రసంగించిన మంత్రి గుడివాడ అమర్ నాథ్
  • పారిశ్రామికాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడి
  • చంద్రబాబు సొంత డప్పు కొట్టుకుంటున్నాడని విమర్శలు 
Minister Gudivada Amarnath slams Chandrababu in assembly

ఏపీ అసెంబ్లీలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, ఆర్థిక పురోగతి అంశాలపై చర్చ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రసంగించారు. పారిశ్రామికాభివృద్ధికి ఏపీ కట్టుబడి ఉందని అన్నారు. పరిశ్రమలు స్థాపించేవారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రశాంత వాతావరణంలో పరిశ్రమలు నడిచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

రాష్ట్రంలో పరిశ్రమలకు సంబంధించి 301 అంశాలపై రాండమ్ గా సర్వే చేయించి జాతీయ స్థాయి ర్యాంకులు ఇచ్చారని, భారతదేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని, అందుకు గర్విస్తున్నామని అన్నారు. గతంలో ప్రభుత్వాలు నివేదిక పంపితే, వాటి ఆధారంగా కేంద్రం ర్యాంకింగ్స్ ఇచ్చేదని వివరించారు. 

సీఎం జగన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ముందుంటే, 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబు ఈజ్ ఆఫ్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ లో ముందున్నారని అమర్ నాథ్ ఎద్దేవా చేశారు. ఏపీలో 60 ఇండస్ట్రీలను మూసేసిన ఘనత చంద్రబాబుకే చెందుతుందని, పైగా అవి తమ అచీవ్ మెంట్స్ అని రాసుకున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని స్పందిస్తూ... "రివర్స్ లో అచీవ్ మెంటేమో" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

అనంతరం అమర్ నాథ్ తన ప్రసంగం కొనసాగిస్తూ, రాష్ట్రంలో ఉన్న పేదవాడికి మంచి చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచనా విధానం అని, అందుకు నవరత్నాల ద్వారా కార్యాచరణ అమలు చేస్తున్నామని వెల్లడించారు. కొవిడ్ సంక్షోభంలోనూ, ప్రపంచవ్యాప్త పరిస్థితుల నడుమ కూడా, రాష్ట్రంలో గత మూడేళ్ల కాలంలో పారిశ్రామికాభివృద్ధి జరిగిందని అన్నారు.

భారీ పరిశ్రమలకు సంబంధించి రూ.46 వేల కోట్ల పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలకు సంబంధించి రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో పాటు 2.11 లక్షల మందికి ఉద్యోగావకాశాలు రాష్ట్రంలో సాకారం అయ్యాయని వివరించారు. ఈ పరిశ్రమలు ఇప్పటికే ఏర్పాటై కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని మంత్రి అమర్ నాథ్ వెల్లడించారు. 

అనంతరం, మంత్రి అమర్ నాథ్ విపక్షనేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఇటీవల చంద్రబాబు అమరావతి పుస్తకావిష్కరణ సభలో అరగంట మాట్లాడితే దాదాపు 25 నిమిషాల సేపు హైదరాబాద్ గురించే చెప్పారని వెల్లడించారు. 

"హైదరాబాద్ తాలూకు చరిత్ర అందరికీ తెలిసిందే. 420 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర హైదరాబాద్ సొంతం. అందులో చంద్రబాబు ఓ 9 ఏళ్లు పనిచేసి ఉంటాడేమో! 1591లో కులీకుతుబ్ షా హయాంలో హైదరాబాద్ నగరం ఏర్పడింది. చంద్రబాబు తాను గత జన్మలో కులీకుతుబ్ షాను అని భావిస్తుంటాడు. 16వ శతాబ్దంలో మొఘల్ రాజులా, నిజాం నవాబుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిలా ఊహించుకుంటాడు. 

ఇటీవల ఆ ఉత్తరాంధ్రకు వచ్చిన సందర్భంగా... తమ్ముళ్లూ, మీ సెల్ ఫోన్లన్నీ బయటికి తీయండి అన్నాడు. అందరూ సెల్ ఫోన్లు బయటికి తీయగానే.. ఎంత బాగా వాడుతున్నారు తమ్ముళ్లూ నేను కనిపెట్టిన సెల్ ఫోన్లు అంటాడు. కంప్యూటర్ ను తానే కనిపెట్టానని అంటాడు. ఐటీ విప్లవానికి తానే ఆద్యుడ్ని అంటాడు. 

ఎవరైనా మన గురించి పక్కవాళ్లు ఆదర్శంగా తీసుకోవాలి గానీ, మనకు మనం డప్పు కొట్టుకోకూడదు. చంద్రబాబుకు ప్రజల్ని మోసం చేయాలన్న తాపత్రయం ఎందుకు? ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు హామీ ఏమైంది? 

70 సంవత్సరాల చరిత్రలో రాష్ట్రంలో 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే, ఆ సంఖ్యను 6 లక్షలకు తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది. వాలంటీర్లను పక్కనబెడితే, ఒక్క సచివాలయ వ్యవస్థలోనే 1.30 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఆర్టీసీ నుంచి ప్రభుత్వంలో విలీనమైన ఉద్యోగుల సంఖ్య 40 వేలకు పైగా ఉంటుంది" అని వివరించారు.

More Telugu News