Gautam Adani: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో రెండో స్థానానికి అదానీ.. ఫోర్బ్స్​ వెల్లడి

Gautam adani becomes worlds second richest person
  • షేర్ల ధరలు పెరగడంతో అదానీ సంపద 155.7 బిలియన్‌ డాలర్లకు చేరిందన్న ఫోర్బ్స్
  • ఈ స్థాయికి చేరిన తొలి ఆసియన్, ఇండియన్ అదానీయే కావడం విశేషం
  • 92.3 బిలియన్‌ డాలర్ల సంపదతో 8వ స్థానంలో నిలిచిన ముకేశ్ అంబానీ
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రెండో స్థానానికి చేరారు. స్టాక్ మార్కెట్లో ఆయన కంపెనీలకు చెందిన షేర్ల విలువ బాగా పెరగడంతో.. అదానీ ఆస్తుల విలువ పెరిగిందని.. ఈ క్రమంలో ఆయన రెండో స్థానానికి చేరారని ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ సూచీ తెలిపింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఉండగా.. ఫ్రాన్స్ కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్డ్ మూడో స్థానంలోను, అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ నాలుగో స్థానంలోను ఉన్నారు.

ఆ స్థాయికి వెళ్లిన తొలి భారతీయుడు
దాదాపు మూడేళ్లుగా సంపద విలువలో అత్యంత వేగంగా ఎదుగుతూ వచ్చిన అదానీ.. ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో స్థానానికి ఎగబాకి రికార్డు సృష్టించారు. ఈ స్థాయికి చేరిన తొలి ఆసియా వ్యక్తి, భారతీయుడు కూడా అదానీయే కావడం గమనార్హం. ఆయన కంపెనీ షేర్ల ధరలు పెరగడంతో సంపద 155.7 బిలియన్‌ డాలర్లకు చేరినట్టు ఫోర్బ్స్ రియల్ టైమ్ సూచీ వెల్లడించింది.

బ్లూమ్‌ బెర్గ్‌ బిలియనీర్స్‌ సూచీలో మాత్రం గౌతమ్‌ అదానీ మూడో స్థానంలో ఉన్నారు. ఆ సూచీ ముందురోజు స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి ఉన్న విలువను పరిగణనలోకి తీసుకుంటుంది. అందువల్ల శుక్రవారం అదానీ కంపెనీల షేర్లు పెరిగిన విలువ అందులో జమ కాలేదు.

8వ స్థానంలో ముకేశ్ అంబానీ
రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ 92.3 బిలియన్‌ డాలర్ల సంపదతో 8వ స్థానంలో నిలిచినట్టు పేర్కొంది. స్టాక్‌ మార్కెట్లలో షేర్ల ధరలకు అనుగుణంగా కుబేరుల సంపద ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఈ మేరకు ధనవంతుల జాబితాలోని వ్యక్తుల స్థానాల్లో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ సూచీ ధనవంతుల జాబితాను చూపిస్తూ ఉంటుంది.

Gautam Adani
Adani
Forbes
World second richest person
Forbes index
Billionaire
India
Business

More Telugu News