Cattle: దేశంలో లంపీ వైరస్​ ఉద్ధృతి.. ఇప్పటివరకు 67 వేల పశువులు మృతి చెందినట్టు కేంద్రం వెల్లడి

  • రాజస్థాన్, గుజరాత్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాప్తి
  • దీనికి ప్రత్యేకంగా ‘ఎల్ఎస్ డీ’ వ్యాక్సిన్ రూపొందించినట్టు కేంద్రం వెల్లడి
  • మరో మూడు, నాలుగు నెలల్లో అందుబాటులోకి వస్తుందని వివరణ
67K cattle died so far by lumpy skin disease

మన దేశంలో లంపీ వైరస్ వ్యాప్తి పెరిగిందని, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 67 వేల పశువులు చనిపోయాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశంలో పశువులకు ఈ ఏడాది జులైలో లంపీ స్కిన్ డిసీజ్ వ్యాధి వ్యాపించడం మొదలైంది. సుమారు ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పశువులకు వ్యాక్సిన్లు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ప్రస్తుతం ‘గోట్ పాక్స్’ వ్యాక్సిన్
లంపీ స్కిన్ డిసీజ్ కు సంబంధించి ప్రస్తుతం పూర్తి స్థాయి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఆయా రాష్ట్రాల్లో ‘గోట్ పాక్స్’ వ్యాక్సిన్ ను పశువులకు ఇస్తున్నారని కేంద్ర పశుసంవర్థక, డెయిరీ అభివృద్ధి శాఖ సెక్రెటరీ జతింద్రనాథ్ తెలిపారు. ప్రత్యేకంగా లంపీ స్కిన్ డిసీజ్ కోసం జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ‘లంపీ ప్రోవాక్ ఇండ్ (ఎల్ఎస్ డీ)’ను రూపొందించినట్టు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ మూడు, నాలుగు నెలల్లో అందుబాటులోకి రానున్నట్టు వివరించారు.

ఎనిమిది రాష్ట్రాల్లో..
ప్రస్తుతం లంపీ స్కిన్ డిసీజ్ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాప్తిలో ఉంది. ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లోనూ ఒకట్రెండు లంపీ వైరస్ కేసులు నమోదైనట్టు కేంద్ర వ్యవసాయ, పశు సంవర్థక శాఖల అధికారులు చెబుతున్నారు.

రాజస్థాన్ లో ఎక్కువగా..
ప్రస్తుతం గుజరాత్, రాజస్థాన్ లలో లంపీ స్కిన్ డిసీజ్ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉందని జతింద్రనాథ్ తెలిపారు. రాజస్థాన్ లో అయితే రోజుకు ఆరేడు వందల పశువులు చనిపోతున్నట్టు తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో రోజుకు వంద, రెండు వందల పశువులు చనిపోతున్నట్టు వివరించారు. గోట్ పాక్స్ వ్యాక్సిన్ లంపీ వైరస్ పై సమర్థవంతంగానే పనిచేస్తోందని.. ఇప్పటివరకు ఒకటిన్నర కోట్ల పశువులకు ఈ వ్యాక్సిన్ వేశారని వెల్లడించారు.

More Telugu News