Jharkhand: స్నేహితులుగా ఉందామా?.. కిడ్నాప్ చేయమంటారా?: రాంచీ స్కూలులోని అమ్మాయిలకు రౌడీ కుర్రాళ్ల బెదిరింపు

  • ప్రభుత్వ పాఠశాలలో ఘటన
  • అమ్మాయిలకు అండగా నిలిచిన టీచర్లు, ఇతర విద్యార్థులకు కూడా బెదిరింపు
  • విచారణ కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు
  • దోషులను వదిలిపెట్టబోమన్న పోలీసులు
  • హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై బీజేపీ మండిపాటు
Muslim goons threat to Hindu girls at Ranchi school

ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ప్రభుత్వ పాఠశాలలో కొందరు ముస్లిం అబ్బాయిలు చెలరేగిపోయారు. ఆయుధాలతో అమ్మాయిల వద్దకు వెళ్లి తమను స్నేహితులుగా అంగీకరించాలని బలవంతం చేశారు. కాదూ, కూడదూ అంటే కిడ్నాప్ తప్పదని హెచ్చరించారు. అక్కడే ఉన్న ఉపాధ్యాయులు, కొందరు విద్యార్థులు అమ్మాయిలకు మద్దతుగా నిలవడంతో ముస్లిం అబ్బాయిలు వారిని కూడా బెదిరించారు. అంతేకాకుండా దాడి తప్పదని హెచ్చరించారు.

బాధిత అమ్మాయిలు 9వ తరగతి చదువుతున్నారు. వారిలో కొందరు గిరిజన, హిందూ అమ్మాయిలు ఉన్నారు. వారం రోజుల నుంచి రోజూ తమకు ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయని బాధిత అమ్మాయిలు తెలిపారు. బాధిత అమ్మాయిలు, స్కూలు యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. 

ఈ ఘటనకు మతపరమైన రంగు పులమొద్దని సీనియర్ పోలీసు అధికారి నౌషద్ ఆలం పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు మేధావులని అన్నారు. పోలీసులు అమాయకుల జోలికి వెళ్లబోరని, అలాగని దోషులను వదిలిపెట్టరని హెచ్చరించారు. కాగా, విషయం వెలుగులోకి రాగానే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ విరుచుకుపడింది. రాష్ట్రంలో లవ్ జిహాద్, పోకిరీ ఘటనలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందని ధ్వజమెత్తారు.  

కాగా, ఇటీవల దుమ్కా పట్టణంలో తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఓ యువతిపై ముస్లిం యువకుడు పెట్రోలు పోసి తగలబెట్టాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన జరిగి రోజులు కూడా గడవకుండానే అదే పట్టణంలో ఓ గిరిజన బాలికను హత్య చేసి చెట్టుకు వేలాడదీశారు. ఆమెపై అత్యాచారం జరిగినట్టు ఆరోపణలున్నాయి.

More Telugu News