Bengaluru: పాములతో బెదిరిపోతున్న బెంగళూరు వాసులు

  • కొన్ని రోజులుగా బెంగళూరును ముంచెత్తిన వరద నీరు
  • దీంతో ఇళ్లల్లోకి చేరిన విష సర్పాలు, ఎలుకలు
  • ఇళ్లను శుభ్రం చేసుకునే క్రమంలో పాము కాట్లు
After floods Bengalureans now face snakes rodents menace

భారీ వర్షాలకు డ్రైనేజీలు పొంగి పొర్లి, ముంపునకు గురైన బెంగళూరు వాసులు ఇప్పుడు పాములతో హడలిపోతున్నారు. ఇళ్లను శుభ్రం చేసుకునే క్రమంలో పాములు, ఎలుకలు బయట పడుతున్నాయి. వాటిని బయటకు పంపించేందుకు ఇరుగుపొరుగు, నిపుణుల సాయం కోరుతున్నారు. గత రెండు రోజుల్లోనే నగరవ్యాప్తంగా పాము కాట్ల కేసులు వందల సంఖ్యలో వెలుగు చూసినట్టు బెంగళూరు మిర్రర్ తెలిపింది.

బెంగళూరులోని చాలా ఆసుపత్రుల్లో యాంటీ స్నేక్ వీనమ్ సెరమ్ ఇంజెక్షన్ల నిల్వలు కూడా అయిపోయాయి. ఒకేసారి భారీ సంఖ్యలో పాము కాటు కేసులు రావడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. బాప్టిస్ట్, బౌరింగ్, సేంట్ జాన్స్ హాస్పిటల్స్ లో యాంటీ స్నేక్ వీనమ్ ఇంజెక్షన్ల నిల్వలు ఎక్కువగా ఉంటుంటాయి. ఈ ఆసుపత్రులు ఎక్కువగా పాము కాటు కేసులను ట్రీట్ చేస్తుంటాయి. ఇక్కడ కూడా ఇంజెక్షన్లు అందుబాటులో లేకుండా పోయాయి. 

రక్త పింజర, కోబ్రా, కట్ల పాము, కామన్ క్రైట్ రకాలు ఎక్కువగా బెంగళూరులో కనిపిస్తుంటాయి. వర్షపు నీటికి ఇవి చాలా వరకు కొట్టుకుపోగా, మిగిలిన పాములు, ఎలుకలు ఆశ్రయం కోసం ఇళ్లల్లోకి చేరిపోయాయి. కొన్ని రోజులుగా ఆహారం లేకపోవడంతో ఇవి దాడి చేసే గుణంతో ఉంటాయని నిపుణులు అంటున్నారు. 

More Telugu News