Sri Lanka: సూపర్-4 చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన లంక.. రేపటి ఫైనల్‌కు ముందు ఒత్తిడిలో పాక్!

  • సూపర్-4 చివరి మ్యాచ్‌లో లంక భారీ విజయం
  • రేపటి ఫైనల్ మ్యాచ్‌కు ముందు పూర్తి ఆత్మవిశ్వాసం
  • పాక్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీసిన వనిందు హసరంగ
Spinners Nissanka star in Sri Lankas dominant win

ఆసియాకప్‌ ప్రారంభ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న శ్రీలంక పడిలేచిన కెరటంలా విజృంభిస్తోంది. సూపర్-4లో భాగంగా గత రాత్రి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రేపు జరగనున్న ఫైనల్‌కు ముందు పాకిస్థాన్‌ను ఒత్తిడిలోకి నెట్టేసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ను లంక బౌలర్లు వణికించారు. వరుసపెట్టి వికెట్లు తీస్తూ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ముఖ్యంగా వనిందు హసరంగ పాక్ ఇన్నింగ్స్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. అలాగే, తీక్షణ, ప్రమోద్ మధూసన్‌లు కూడా పాక్ బ్యాటర్ల భరతం పట్టారు. వీరి దెబ్బకు పాక్ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 121 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ బాబర్ ఆజం చేసిన 30 పరుగులే వ్యక్తిగత అత్యధికం కాగా, నవాజ్ 26 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేకపోయారు. ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ దాటలేకపోయారు. లంక బౌలర్లలో హసరంగ 3, మహీష్ తీక్షణ, ప్రమోద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం 122 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 17 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. తొలి ఓవర్ రెండో బంతికి కుశాల్ మెండిస్ డకౌట్ కాగా, రెండో ఓవర్‌లో దనుష్క గుణతిలక డకౌట్ అయ్యాడు. ఐదో ఓవర్ చివరి బంతికి 29 పరుగుల వద్ద ధనంజయ డి సిల్వా (9) వెనుదిరిగాడు. దీంతో లంక పని అయిపోయినట్టేనని భావించారు. అయితే ఓపెనర్ పాతుమ్ నిశ్శంక అజేయ అర్ధ సెంచరీ (55)తో ఆదుకుని జట్టును విజయ తీరాలకు చేర్చాడు. భానుక రాజపక్స 24, కెప్టెన్ దాసున్ షనక 21 పరుగులు చేశారు. మూడు వికెట్లు తీసి పాక్ జట్టును కల్లోలం లోకి నెట్టేసిన వనిందు హసరంగకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

More Telugu News