Telangana: హైద‌రాబాద్‌ను ప్ర‌శాంతంగా ఉండ‌నీయ‌రా?: త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌

  • హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్ట‌డానికే హిమంత వ‌చ్చార‌న్న త‌ల‌సాని
  • తాము కూడా అసోం వెళ్లి మాట్లాడ‌గ‌ల‌మ‌ని వ్యాఖ్య‌
  • అయినా తాము సంయ‌మ‌నం పాటిస్తున్నామ‌ని వెల్ల‌డి
talasani fires on bjp leaders over mj market issue

వినాయ‌కుడి శోభా యాత్ర సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని ఎంజే మార్కెట్ వ‌ద్ద శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం చోటుచేసుకున్న ఉద్రిక్త ప‌రిస్థితిపై మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స్పందించారు. హైద‌రాబాద్‌ను ప్ర‌శాంతంగా ఉండ‌నీయ‌రా? అంటూ ఆయ‌న బీజేపీ నేత‌లపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్ట‌డానికే అసోం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ న‌గ‌రానికి వ‌చ్చార‌ని ఆయ‌న ఆరోపించారు. తాము కూడా అసోం వెళ్లి మాట్లాడ‌గ‌ల‌మ‌న్నారు. కావాల‌ని రాజ‌కీయం చేస్తున్నార‌న్న‌ త‌ల‌సాని.. తాము మాత్రం సంయ‌మ‌నం పాటిస్తున్నామ‌ని తెలిపారు. 

హైద‌రాబాద్ గ‌ణేశ్ ఉత్స‌వ క‌మిటీ ఆహ్వానం మేర‌కు హైద‌రాబాద్ వ‌చ్చిన హిమంత బిశ్వ శ‌ర్మ శుక్ర‌వారం న‌గ‌రంలో శోభా యాత్ర‌లో పాలుపంచుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఎంజే మార్కెట్ వ‌ద్ద ఏర్పాటు చేసిన వేదిక మీద మాట్లాడిన ఆయ‌న కేసీఆర్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేసిన‌ట్లుగా టీఆర్ఎస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టీఆర్ఎస్‌కు చెందిన నందూ బిలాల్ అనే కార్య‌క‌ర్త హిమంత బిశ్వ శ‌ర్మ‌ను అడ్డుకునేందుకు య‌త్నించారు. ఈ సందర్భంగా కొంత‌సేపు అక్క‌డ ఉద్రిక్త‌త నెల‌కొంది. అయితే స‌కాలంలో పోలీసులు స్పందించ‌డంతో ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగింది. ఈ ఘ‌ట‌న‌పై స్పందిస్తూనే త‌లసాని పై వ్యాఖ్య‌లు చేశారు.

More Telugu News