Hotels: వర్షాలతో బెంగళూరు అతలాకుతలం.. హోటల్ రూమ్ లకు భలే గిరాకి.. రోజుకు రూ. 40 వేలు మాత్రమే!

  • వరదలతో బెంగళూరు అతలాకుతలం
  • ఐటీ హబ్‌ను ముంచెత్తిన వానలు
  • హోటళ్లకు క్యూ కడుతున్న కుటుంబాలు
  • శుక్రవారం పలు హోటళ్లలోని గదులన్నీ ఫుల్
Bengaluru Hotel Room Rates Jumped to Rs 40000

వర్షాలు బీభత్సం సృష్టించిన బెంగళూరులో హోటళ్లకు అనుకోని గిరాకి ఏర్పడింది. వరదలతో సిలికాన్ వ్యాలీ అతలాకుతలం కావడంతో హోటళ్లకు కలిసొచ్చింది. ఐటీహబ్‌ను వరదలు ముంచెత్తడంతో అక్కడ నివసిస్తున్న కుటుంబాలను సమస్యలు చుట్టుముట్టాయి. తాగేందుకు నీరు కూడా దొరకకపోవడంతో వారంతా హోటళ్లకు క్యూ కడుతున్నారు. వరదలు తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అక్కడే ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోటళ్ల యాజమాన్యాలు ఒక్కసారిగా రూముల ధరలను పెంచేశాయి.

హోటలు గదికి ఇప్పటి వరకు రోజుకు రూ. 10 వేల నుంచి 20 వేలు వసూలు చేస్తుండగా, తాజాగా ఈ ధరలను రూ. 30 వేల నుంచి రూ. 40 వేలకు పెంచేశాయి. వరదలకు దెబ్బతిన్న వైట్‌ఫీల్డ్, అవుటర్ రింగ్‌రోడ్డు, ఓల్డ్ ఎయిర్‌పోర్టు రోడ్డు, కోరమంగళ తదితర ప్రాంతాల్లో హోటళ్లలోని గదులన్నీ శుక్రవారం వరకు బుక్ అయిపోయినట్టు తెలుస్తోంది. 

ఇక, ఓల్డ్ ఎయిర్‌పోర్టు రోడ్డులోని లీలా ప్యాలెస్‌లో ప్రస్తుతం ఓ గది ప్రారంభ ధర రూ.18,113 ఉండగా, తాజ్ బెంగళూరులో డీలక్స్ గది బుకింగ్ కోసం పన్నులు కలుపుకుని రోజుకు రూ 14,750 వసూలు చేస్తున్నారు. ఊరట ఇచ్చే విషయం ఏమిటంటే ఓయో హోటళ్లలో ధరలు మాత్రం అందరికీ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ ధర రూ. 1200 కంటే తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News