బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 ఇకలేరు!
- అనారోగ్యంతో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచిన రాణి
- బ్రిటన్ ను 70 ఏళ్లు పాలించిన రాణిగా రికార్డు
- భారత రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం
70 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన రాణిగా ఎలిజబెత్ 2 గుర్తింపు పొందారు. 1922లో జన్మించిన ఆమె ప్రిన్స్ పిలిప్ మౌంట్ బాటెన్‌ను 1947లో వివాహం చేసుకున్నారు. 22 ఏళ్ల వయస్సులోనే బ్రిటన్ రాణి కిరీటం ధరించారు. బ్రిటన్ రాజకుటుంబం చరిత్రలో అత్యధిక కాలం రాణిగా కొనసాగారు. రాణి 70 ఏళ్ల సేవలకు గుర్తుగా గత జూన్ నెలలో దేశ వ్యాప్తంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు.
బ్రిటన్ రాణి ఎలిజబెత్2 మృతిపట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కాలపు గొప్ప నాయకురాలిగా రాణి ఎలిజబెత్ నిలిచిపోతారని మోదీ అన్నారు. బ్రిటన్ కు సమర్థమైన, స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని రాణి ఎలిజబెత్ అందించారని ఆయన కొనియాడారు.