Raghunandan Rao: అసెంబ్లీలో మా కుర్చీలను వెతుక్కునేలోపే సభను వాయిదా వేశారు: రఘునందన్ రావు మండిపాటు

Assembly session adjourned in just 6 minutes says Raghunandan Rao
  • బీఏసీ సమావేశాలకు మమ్మల్ని పిలవలేదన్న రఘునందన్ 
  • 12, 13 తేదీల్లో బీజేపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపణ 
  • మరమనిషి అంటే తప్పేముందని ప్రశ్న 
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. శాసనసభలో తాము కుర్చీలను వెతుక్కునేలోపే కేవలం 6 నిమిషాల్లోనే సభను వాయిదా వేశారని మండిపడ్డారు. బీఏసీ సమావేశాన్ని నిర్వహించకుండానే సమావేశాల తేదీలను ఖరారు చేశారని విమర్శించారు. మూడు రోజుల పాటు సమావేశాలను నిర్వహిస్తున్నట్టు మీడియాకు లీకులు ఇచ్చారని అన్నారు.

బీఏసీ సమావేశాలకు బీజేపీని పిలవాలని స్పీకర్ ను కలిసి కోరానని... అయినా తమను పిలవలేదని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో లోక్ సత్తా, సీపీఎం పార్టీలకు ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ బీఏసీకి పిలిచారనే విషయాన్ని స్పీకర్ కు గుర్తు చేశానని... అయినా ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీని పిలవలేదని మండిపడ్డారు. 

అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే బీఏసీ సమావేశాలకు పిలుస్తారని ప్రశ్నించారు. 12, 13 తేదీల్లో బీజేపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా కుట్రలు చేస్తున్నారని అన్నారు. స్పీకర్ ను మరమనిషి అంటే తప్పేముందని... అదేమైనా నిషేధిత పదమా? అని ప్రశ్నించారు.
Raghunandan Rao
BJP
Assembly Speaker
TRS

More Telugu News