Ranbir Kapoor: అలియా, రణ్​ బీర్​ దంపతులకు చేదు అనుభవం.. గుడిలోకి వెళ్లకుండా అడ్డగింత

Ranbir Kapoor  Alia Bhatt stopped from entering Ujjains Mahakal temple
  • మధ్యప్రదేశ్ లోని ప్రముఖ ఉజ్జయిని మహాకాళేశ్వర గుడి వద్ద ఘటన
  • గొడ్డు మాంసం తింటామని రణ్ బీర్, అలియా గతంలో చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం
  • వారిని దైవ దర్శనానికి వెళ్లకుండా అడ్డుకున్న భజ్ రంగ్ దళ్ కార్యకర్తలు
బాలీవుడ్ రియల్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనానికి వెల్లిన ఈ యువ జంటను గుడిలోకి వెళ్లకుండా కొందరు అడ్డుకున్నారు. బీఫ్ (గొడ్డు మాంసం) తినే విషయంలో ఈ ఇద్దరూ గతంలో చేసిన కామెంట్లకు నిరసనగా భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆలయం వద్ద వీరిని అడ్డుకున్నారు. 

‘బ్రహ్మాస్త్ర’ విడుదల సందర్భంగా దైవ దర్శనానికి వచ్చిన చిత్రం బృందాన్ని నల్ల జెండాలు పట్టుకొని వచ్చి అడ్డుకున్నారు. వాళ్లను ఆలయంలోకి అనుమతించేది లేదని నిరసన చేపట్టారు. తనకు బీఫ్ అంటే చాలా ఇష్టమని అలియా చాలా ఏళ్ల కిందట చెప్పిన ఓ క్లిప్ ఈ మధ్య  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని రోజుల కిందట రణ్ బీర్ తాను మటన్, చికెన్ తో పాటు బీఫ్ కూడా తింటానని చెప్పాడు. దాంతో, అలియా, రణ్ బీర్ లపై భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను బాయ్ కాట్ చేయాలని పలువురు నెజిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ‘బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర’ పేరుతో ట్రోల్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన అలియా.. సినిమాను చూడాలనుకుంటే చూడండి, ఆసక్తి లేకపోతే మానేయండి అని కామెంట్ చేసింది. దీనిపై కూడా ఆమెను పలువురు టార్గెట్ చేశారు. 

ఇక, సినిమా విడుదల నేపథ్యంలో భర్త రణ్ బీర్, దర్శకుడు అయాన్ ముఖర్జీతో కలిసి దైవ దర్శనానికి వస్తున్నట్టు అలియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది తెలుసుకున్న భజ రంగ్ దళ్ కార్యకర్తలు గుడి వద్దకు వచ్చి వారిని అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. చివరికి దర్శకుడు అయాన్ ముఖర్జీకి మాత్రం పర్మిషన్ ఇవ్వడంతో ఆయన ఒక్కరే దర్శనం చేసుకున్నారు. కాగా, ఈ నెల 9న ‘బ్రహ్మాస్త్ర’ హిందీతో పాటు పలు భాషల్లో విడుదలవనుంది.
Ranbir Kapoor
Alia Bhatt
temple
stopped

More Telugu News