Team India: ప‌రుగులు చేసేందుకు క‌ష్ట‌ప‌డ్డ టీమిండియా... శ్రీలంక టార్గెట్ 174 ప‌రుగులు

  • 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లకు 173 ప‌రుగులు చేసిన భార‌త్‌
  • 72 ప‌రుగుల‌తో జట్టును ఆదుకున్న కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌
  • లంక బౌల‌ర్ దిల్షాన్ మ‌ధుశంక ఖాతాలో 3 వికెట్లు
team india scores 173 runs in 20 overs against sri lanka

గెలిచి నిల‌వాల్సిన కీల‌క మ్యాచ్‌లో టీమిండియా బ్యాట‌ర్లు ప‌రుగులు రాబ‌ట్టేందుకు నానా క‌ష్టాలు ప‌డ్డారు. ఆసియా క‌ప్‌లో దుబాయి వేదిక‌గా మంగ‌ళ‌వారం రాత్రి శ్రీలంక‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 173 ప‌రుగులు చేసింది. మ‌రికాసేప‌ట్లో ఛేజింగ్‌కు దిగ‌నున్న శ్రీలంక‌కు 174 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.

టీమిండియా బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (72), సూర్య కుమార్ యాద‌వ్ (34) మిన‌హా మ‌రే ఇత‌ర బ్యాట‌ర్లు కూడా ఈజీగా ప‌రుగులు రాబ‌ట్టలేక‌పోయారు. చివ‌ర‌లో వ‌చ్చిన ర‌విచంద్ర‌న్ అశ్విన్ (15), హార్దిక్ పాండ్యా (17), రిష‌బ్ పంత్‌ (17) ఫర‌వా లేద‌నిపించ‌గా... మిగిలిన వారు అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయారు. అంతేకాకుండా మూడు విడ‌త‌లుగా వికెట్లు చేజార్చుకున్న టీమిండియా తొలి రెండు విడ‌త‌ల్లో రెండేసి వికెట్లు చేజార్చుకుంది. మూడో విడ‌త‌లో ఏకంగా 3 వికెట్ల‌ను కోల్పోయింది. 

శ్రీలంక బౌలింగ్‌లో దిల్షాన్ మ‌ధుశంక 3 వికెట్లు తీసి స‌త్తా చాటాడు. వ‌రుస‌గా వికెట్లు తీసిన లంక బౌల‌ర్లు... ప‌రుగుల‌ను నియంత్రించ‌డంలో మాత్రం అంత‌గా రాణించ‌లేద‌నే చెప్పాలి. భార‌త్ వికెట్లు వ‌రుస‌గా ప‌డినా... ఆ జ‌ట్టు స్కోరు 173 ప‌రుగుల‌కు చేర‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పాలి. ఇక చ‌మిక క‌రుణర‌త్నే, దాసున్ శ‌న‌కల‌కు చెరో 2 వికెట్లు ద‌క్కాయి. మ‌హేశ్ తీక్ష‌ణ‌కు ఓ వికెట్ ద‌క్కింది. మ‌రికాసేప‌ట్లో 174 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో శ్రీలంక త‌న ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నుంది.

More Telugu News