High Blood Pressure: హైపర్ టెన్షన్ ను తగ్గించుకునేందుకు ఆరు మార్గాలు!

  • ప్రపంచంలో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక రక్తపోటు
  • 1.28 బిలియన్ల మంది హై బీపీ బాధితులేన్న డబ్ల్యూహెచ్ఓ
  • నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమంటున్న నిపుణులు
  • సాధారణ మార్గాలలోనే బీపీ నియంత్రించుకోవచ్చని వెల్లడి
Six ways to lower the risk from High Blood Pressure

చాలామంది తమకు హై బీపీ ఉందని తెలుసుకోలేరు. చాలా అరుదుగానే హై బీపీ లక్షణాలు బయటపడుతుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 1.28 బిలియన్ల మంది ఈ అధిక రక్తపోటుతో బాధపడుతున్నారట. హై బీపీ లేక హైపర్ టెన్షన్ ను నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ముఖ్యంగా, అల్పాదాయ, మధ్యస్థ ఆదాయ దేశాల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

హైపర్ టెన్షన్ హృదయ సంబంధ వ్యాధులకు, అకాల మరణాలకు దారితీస్తుందని ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు చెప్పేమాట. కాగా, రక్తపోటు స్థాయులు 120/80 నుంచి 140/90 మధ్య ఉన్నవారిలో అధిక రక్తపోటు ముప్పుకు అవకాశాలు ఉన్నట్టు భావించాల్సి ఉంటుందట. అయితే, ఈ హై బీపీని తగ్గించుకునేందుకు 6 మార్గాలు ఉన్నాయని నిపుణులు సూచించారు. 


1.ప్రతి రోజూ స్పెషల్ టీ

ప్రత్యేకంగా తయారుచేసిన టీ తాగడం ద్వారా అధిక రక్తపోటును తగ్గించుకోవచ్చు. ఫుడ్ సైన్స్ అనే పాకిస్థానీ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం... ప్రతి రోజు వెల్లుల్లి, తేనె కలిపిన టీ తాగడం ద్వారా హై బీపీని కట్టడి చేయవచ్చు. వెల్లుల్లి, తేనెలో హైపర్ టెన్షన్ ను అదుపులో ఉంచే పదార్థాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా టీ ఎంత తాగినా ఫర్వాలేదని, పైగా ఆరోగ్యదాయకమని సదరు అధ్యయనంలో పేర్కొన్నారు.

2. ఉప్పు వాడకంపై ఓ కన్నేసి ఉంచాలి

ఉప్పుకు, హై బీపీకి అత్యంత సన్నిహిత సంబంధం ఉందని జీపీ అండ్ లో సాల్ట్ సలహాదారు, సీజన్ విత్ సెన్స్ భాగస్వామి డాక్టర్ సారా జార్విస్ వెల్లడించారు. హైపర్ టెన్షన్ ముప్పు నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ఆహారంలో ఉప్పును తగ్గించుకోవడం అత్యుత్తమ మార్గం అని వివరించారు. ఉప్పు అధిక రక్తపోటును కలుగుజేస్తుందని, అది హృద్రోగాలకు, గుండెపోటుకు, పక్షవాతానికి దారితీస్తుందని ఆమె వివరించారు. 

దైనందిన వాడకంలో మూడో వంతు ఉప్పు తగ్గిస్తే బ్రిటన్ లో 8 వేల అకాల మరణాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. తద్వారా బ్రిటన్ ఆరోగ్యశాఖకు 500 మిలియన్ పౌండ్ల మేర ఖర్చు కూడా తగ్గుతుందని అన్నారు. ఉప్పు తగ్గించుకోవడం అనేది అధిక రక్తపోటుకు వ్యతిరేకంగా తీవ్ర ప్రభావం కనబరుస్తుందని, ఆహార అలవాట్లలో ఈ కొద్దిపాటి మార్పు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుందని డాక్టర్ సారా వెల్లడించారు.

3. కూరగాయలు, ఆకు కూరలు తినండి

హైపర్ టెన్షన్ కు విరుగుడు పొటాషియం అని పరిశోధనల్లో తేలింది. అందుకే పొటాషియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో అధికంగా పేరుకుపోయిన ఉప్పు కలిగించే దుష్ఫలితాలను పొటాషియం సమర్థంగా తగ్గిస్తుంది. డెలామెరే హెల్త్ అనే సంస్థకు చెందిన నిపుణులు దీనిపై స్పందిస్తూ... పాలకూర, బ్రోకోలీ, చిలగడదుంపలు, పుట్టగొడుగులు, బఠాణీలు, టమాటాలు, అవకాడో, పుచ్చకాయలు, చిక్కుళ్లు, ఎండు ఫలాలు పొటాషియంను సమృద్ధిగా కలిగి ఉంటాయి. 

రోజుకు 3,500 మిలీగ్రాములు, అంతకంటే ఎక్కువ పొటాషియం తీసుకుంటే, అదేస్థాయిలో సోడియం మూత్రవిసర్జన ద్వారా బయటికి వెళ్లిపోతుందట. రక్తనాళాల గోడలపై నెలకొన్న ఒత్తిడిని తగ్గించడంలోనూ పాటాషియం ఎంతో ఉపయోగకారి.

4. విశ్రాంతి కూడా చాలా ముఖ్యం

అధిక రక్తపోటుకు విశ్రాంతి కూడా ఔషధం వంటిదే. సేద దీరడం ద్వారా రక్తపోటు స్థాయులను తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి రక్తపోటును పెంచుతుందంటున్న డెలామెరే హెల్త్ నిపుణులు.... మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరం కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుందని, ఇవి హృదయ స్పందన వేగాన్ని పెంచడమే కాకుండా, రక్తనాళాలు ముడుచుకునిపోయేలా చేస్తాయి. దాంతో రక్తం సాఫీగా ప్రసరించే వీల్లేక ఒక్కసారిగా రక్తపోటు పెరిగిపోతుంది. యోగా, ధ్యానం, ప్రాణాయామం, సంగీతం వినడం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవచ్చని, తద్వారా రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

5. మానవ సంబంధాలు కూడా ముఖ్యమే

ఇతరులతో సుహృద్భావ సంబంధాలు కలిగివుండడం కూడా ఒత్తిడి తగ్గించడంలో కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనుషులను ఆత్మీయంగా హత్తుకోవడం, కరచాలనం, ముద్దాడడం వంటి చర్యలతో మనసు ఉల్లాసంగా మారడమే కాకుండా, అధిక రక్తపోటు దిగొస్తుందట. ఇలాంటి సంఘజీవనంతో గుండెపోటు, హృద్రోగాలు, స్ట్రోక్ ముప్పు తగ్గిపోతుందట. 

నార్త్ కరోలినా యూనివర్సిటీ పరిశోధకులు చేపట్టిన అధ్యయనం ప్రకారం కౌగిలింతలు అధిక రక్తపోటును కట్టడి చేస్తాయట. ఒత్తిడికి గురైనవారిని పరీక్షించగా, తమ భాగస్వామి నుంచి కౌగిలింత అందుకున్నవారితో పోల్చితే, ఇతరుల్లో అధిక రక్తపోటు ఛాయలు కనిపించాయి. అంతేకాదు, నవ్వడం కూడా రక్తపోటు స్థాయిని తగ్గిస్తుంది. లాఫింగ్ థెరపీలో పాల్గొన్న వ్యక్తుల్లో 7 పాయింట్ల మేర రక్తపోటు తగ్గినట్టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలిపింది.

6. శరీరానికి తగిన వ్యాయామం కూడా అవసరమే

శరీరానికి తగినంత వ్యాయామం లేకపోయినా అధిక రక్తపోటు ముప్పు ఉంటుంది. వారంలో కనీసం 150 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి. హృదయ సంబంధిత వ్యవస్థల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా, గుండె కూడా మెరుగైన పనితీరు కనబర్చుతుంది. క్రమం తప్పకుండా కసరత్తులు చేయడం వల్ల రక్తనాళాల బిరుసుతనం పోయి, రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. 

అయితే, అందుకోసం జిమ్ లో గంటల తరబడి అత్యంత కష్టసాధ్యమైన వ్యాయామాలు చేయనక్కర్లేదని, కిలోమీటర్ల కొద్దీ పరుగులు తీయనక్కర్లేదని... శ్వాస గట్టిగా తీసుకునేంత స్థాయిలో, గుండె కాస్త వేగంగా కొట్టుకునేంతగా వ్యాయాయం చేస్తే చాలని నిపుణులు అంటున్నారు. 


More Telugu News