Face Fat: ముఖ భాగంలో కొవ్వు తగ్గించుకునేందుకు నిపుణులు సూచిస్తున్న 8 మార్గాలివిగో!

  • శరీరంలో ఎక్కడ కొవ్వు చేరినా తగ్గించుకునేందుకు సమయం పడుతుందన్న నిపుణులు
  • నీళ్లు ఎక్కువగా తీసుకోవడం, సరైన నిద్రతో ప్రయోజనం ఉంటుందని వెల్లడి
  • చక్కెరకు, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచనలు
Want to reduce face fat fallow these 8 things

మారిన జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా చాలా మంది బరువు పెరిగిపోతున్నారు. ఊబకాయం, మధుమేహం వంటి సమస్యల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో శరీరంలో కొవ్వును తగ్గించుకునేందుకు చాలా కష్టపడుతున్నారు. కొన్నిసార్లు నిపుణులు, వైద్యుల సలహా తీసుకుంటున్నారు. మరికొన్నిసార్లు తోచిన విధంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత ప్రయత్నించినా.. కొన్ని కీలకమైన అంశాలను గుర్తుంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ముఖం ఉబ్బిపోయి ఉండేవారు ఏయే పదార్థాలు తీసుకుంటే, ఏ జాగ్రత్తలు పాటిస్తే.. సరిదిద్దుకోవచ్చన్న విషయంలో పలు సూచనలు చేస్తున్నారు.

1. కార్డియో వ్యాయామాలు పెంచండి
ముఖ భాగంలో కొవ్వును తగ్గించుకోవాలంటే.. అదే సమయంలో శరీరంలో కొవ్వును తగ్గించుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం బరువు తగ్గడంపై దృష్టిపెట్టడం, రెగ్యులర్ గా వ్యాయామాలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా కార్డియో, ఏరోబిక్ వ్యాయామాలు చేయాలని వివరిస్తున్నారు.

2. ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవారిలో డీహైడ్రేషన్ పరిస్థితి వల్ల శరీరం నీటిని ఎక్కువగా నిల్వ చేసుకుంటుంది. దీనివల్ల ముఖం ఉబ్బిపోయి కనిపిస్తుంటుంది. అంతేగాకుండా ఆల్కహాల్ వల్ల శరీరానికి అందే కేలరీలు పెరిగి.. కొవ్వుగా మారుతుందని, బరువు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటి వల్లా ముఖం ఉబ్బిపోతుందని.. ఆల్కహాల్ కు దూరంగా ఉంటే మంచిదని వివరిస్తున్నారు.

3. సోడియం (ఉప్పు) తీసుకోవడం తగ్గించాలి
 శరీరంలో నీరు ఎక్కువగా చేరడం, ముఖ భాగంలో నీరు చేరి ఉబ్బిపోవడానికి సోడియం అనే మూలకం కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల సోడియం తక్కువగా తీసుకుంటే.. శరీరంలో అధికంగా నీరు చేరకుండా ఉంటుందని, శరీరం తేలికగా ఉంటుందని వివరిస్తున్నారు. సోడియం అంటే ఉప్పులో ఉండే కీలక మూలకం. అందువల్ల ఉప్పు తక్కువగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

4. ఆహారంలో పీచు పదార్థాలు పెంచాలి
శరీరంలో కొవ్వు తగ్గాలన్నా, ముఖం భాగం సన్నగా కావాలన్నా.. ఆహారంలో పీచు పదార్థాలు (ఫైబర్) అధికంగా తీసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం వల్ల జీర్ణ శక్తి మెరుగ్గా ఉంటుందని.. ఇతర జీవక్రియలనూ మెరుగుపరుస్తుందని వివరిస్తున్నారు. శరీరంలో మెటబాలిజం రేటు పెరగడం వల్ల చురుగ్గా ఉండగలుగుతారు. దీనివల్ల ముఖం కాంతివంతంగా అవుతుందని అంటున్నారు.

5. శరీరానికి తగినంత నీరు తాగాలి
 రోజూ మన శరీరానికి అవసరమైనంత మేర నీరు తాగాలి. దీనివల్ల శరీరంలోని విష పదార్థాలు ఎప్పటికప్పుడు శుభ్రమై.. మెటబాలిజం రేటు పెరిగి.. శరీరం చురుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి తరచూ తగిన స్థాయిలో నీరు అందకుండా ఉంటే.. ఉన్న నీటిని నిల్వ చేసుకుని ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుందని వివరిస్తున్నారు. దీనివల్ల దవడల కింది భాగంతోపాటు శరీరంలోని పలు ప్రాంతాల్లో నీరు చేరి ఉబ్బిపోతాయని స్పష్టం చేస్తున్నారు. 

6. తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి
శరీరానికి తగినంత విశ్రాంతి అందనప్పుడు, తగినంత నిద్ర లేనప్పుడు.. శరీరంలో ఒత్తిడిని పెంచే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, గందరగోళం, ఏకాగ్రత లోపం వంటి సమస్యల వల్ల.. అతిగా తినడం, నీరు తగినంతగా తీసుకోకపోవడం వంటి సమస్యలు వస్తాయని.. ఇవి ఊబకాయానికి, ముఖం ఉబ్బిపోవడానికి దారి తీస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఆయా వ్యక్తుల శారీరక పరిస్థితిని బట్టి కనీసం.. ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలని సూచిస్తున్నారు.

7. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి
 రోజూ ఒకే విధమైన ఆహారం కాకుండా.. అన్ని రకాల పోషకాలు అందే మంచి సమతుల ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలని.. ఎక్కువగా ప్రోటీన్లు ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో చక్కెర, ఉప్పు, ఫ్రై చేసిన ఆహారం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యం బాగుండి ముఖం కాంతివంతంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

8. చక్కెరకు వీలైనంత దూరంగా ఉండాలి
 ముఖం వద్ద, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి చక్కెరలు ప్రధాన కారణంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల సరైన డైటింగ్ పాటించడంతోపాటు చక్కెర, ఇతర కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. కొన్ని రకాల మొక్కల ఆకులు తీపిని ఇస్తాయని.. చక్కెరలకు బదులు వాటిని వినియోగించవచ్చని చెబుతున్నారు.

More Telugu News