Vidadala Rajini: కృత్రిమ వేలితో ప్రభుత్వ వైద్యుడి హైటెక్ హాజరు.. సస్పెండ్ చేసిన మంత్రి విడదల రజిని

AP Minister Rajini Suspends guntupall PHC Doctor Bhanuprakash
  • బాపట్ల జిల్లా గుంటుపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి తీరిది
  • కృత్రిమ వేలిని సిబ్బందికి ఇచ్చి రోజూ హాజరు వేయించుకుంటున్న డాక్టర్ భాను ప్రకాశ్
  • తనిఖీకి వచ్చిన మంత్రికి ఫిర్యాదు చేసిన గ్రామస్థులు
  • అక్కడికక్కడే సస్పెండ్ చేసిన రజిని
ఉద్యోగం ప్రభుత్వ ఆసుపత్రిలో అయినా తన ప్రైవేటు క్లినిక్‌లో బిజీగా ఉండే ఓ వైద్యుడు టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు. ప్రతి రోజూ ఆసుపత్రికి హాజరవుతున్నట్టు నమ్మించాడు. చివరికి దొరికిపోయి సస్పెండయ్యాడు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లి పీహెచ్‌సీలో పనిచేసే వైద్యాధికారి భానుప్రకాశ్ తీరిది. నిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆరోగ్య మంత్రి విడదల రజినికి గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

భానుప్రకాశ్‌కు మార్టూరులో సొంత క్లినిక్ ఉంది. నిత్యం అక్కడ బిజీగా ఉండే ఆయన.. తన కృత్రిమ వేలిని పీహెచ్‌సీ సిబ్బందికి ఇచ్చి క్రమం తప్పకుండా మూడు పూటలా హాజరు వేయించేవాడు. దీంతో ఇటు ప్రభుత్వ విధులు, అటు తన ప్రైవేటు క్లినిక్ వ్యవహారం సాఫీగా సాగిపోయేది. ఆయన వ్యవహారాన్ని గమనిస్తూ వచ్చిన గ్రామస్థులు నిన్న పీహెచ్‌సీ తనిఖీకి వచ్చిన మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అంతేకాదు, ఆయన ఆసుపత్రిలోనే సిబ్బందితో కలిసి మద్యం తాగేవారని, మహిళా సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారని, వీడియో కాల్స్ చేస్తుంటారని ఫిర్యాదు చేశారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి వెంటనే భానుప్రకాశ్‌ను సస్పెండ్ చేశారు. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Vidadala Rajini
Andhra Pradesh
Bapatla
Guntupalli PHC

More Telugu News