ktr: తెలంగాణను కాదని వేరే రాష్ట్రాలకు బల్క్ డ్రగ్ పార్కులు కేటాయిస్తారా?: మోదీపై కేటీఆర్ ఫైర్

KTR fires on Modi for not allotting bulk drug park to Telangana
  • ఏపీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లకు బల్క్ డ్రగ్ పార్కుల కేటాయింపు
  • తెలంగాణపై మోదీ సర్కార్ వివక్ష కొనసాగిస్తోందన్న కేటీఆర్
  • బల్క్ డ్రగ్ పార్క్ కోసం కేంద్రం వద్ద కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నామని వ్యాఖ్య
కేంద్రంలోని మోదీ సర్కార్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. దేశంలో ఫార్మా హబ్ గా తెలంగాణ ఉందని... అలాంటి తెలంగాణను కాదని కేవలం మూడు రాష్ట్రాలకే కేంద్రం బల్క్ డ్రగ్ పార్కులను కేటాయించిందని మండిపడ్డారు. తెలంగాణపై మోదీ వివక్షను కొనసాగిస్తూనే ఉన్నారని అన్నారు. 

ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్ ను కేంద్రం కావాలనే విస్మరించిందని చెప్పారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం తాము కొన్నేళ్లుగా కేంద్రం వద్ద ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని తెలిపారు. 2 వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు  కేంద్రానికి తెలిపామని... ఫార్మా సిటీ మాస్టర్ ప్లాన్ ను కూడా అందజేశామని చెప్పారు. 

ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కేంద్ర మంత్రులను కలిసి బల్క్ డ్రగ్ పరిశ్రమకు అవకాశం ఇవ్వాలని కోరామని తెలిపారు. అన్ని సౌకర్యాలతో సిద్ధంగా ఉన్న తెలంగాణకు అవకాశం ఇవ్వకపోవడం తమను షాక్ కు గురి చేసిందని చెప్పారు. ఏపీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో బల్క్ డ్రగ్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం గురువారం నాడు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేంద్రంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
ktr
TRS
Narendra Modi
BJP
Bulk Drug Park

More Telugu News