విధిరాతను ఎవరూ మార్చలేరనే విషయం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉదంతంతో అర్థమయింది: కేవీపీ రామచంద్రరావు

  • వైఎస్సార్ తో నాకున్న అనుబంధం అనిర్వచనీయమన్న కేవీపీ 
  • మా ఇంట్లో అన్ని శుభకార్యాలు, అశుభకార్యాలకు వచ్చేవారని వెల్లడి 
  • వైఎస్సార్ అందరి మనసుల్లో నిలిచిపోయారన్న కేవీపీ 
KVP Ramachandra Rao recollects his relationship with YSR

తన ఆత్మబంధువు వైఎస్సార్ తో తనకున్న అనుబంధాన్ని కేవీపీ రామచంద్రరావు గుర్తుకు తెచ్చుకున్నారు. వైఎస్సార్ తో తనకున్న అనుబంధం అనిర్వచనీయమని, మాటల్లో చెప్పలేనిదని ఆయన అన్నారు. తమ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, అశుభకార్యం జరిగినా రాజశేఖరరెడ్డి వచ్చేవారని చెప్పారు. 

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే సామర్థ్యం కేవలం వైఎస్సార్ కి మాత్రమే ఉందని తన తండ్రి చెప్పేవారని... తన తండ్రి చనిపోయిన సమయంలో కూడా తనకు ఆ మాటలే గుర్తుకొచ్చాయని తెలిపారు. కృష్ణా జిల్లా అంపాపురంలో ఈరోజు వైఎస్సార్ విగ్రహాన్ని కేవీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన చీరలు, పంచెలను పంచి పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

విధిరాతను ఎవరూ మార్చలేరనే  విషయం వైఎస్సార్ మరణంతో అర్థమయిందని కేవీపీ చెప్పారు. ఆ రోజు హెలికాప్టర్ ఆచూకీ మిస్ అయినప్పటికీ... ఆయన తిరిగొస్తారని భావించామని... కానీ దేవుడిలాంటి రాజశేఖరరెడ్డిని దేవుడు తీసుకొనిపోయాడని అన్నారు. వైఎస్సార్ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ... అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. వైఎస్సార్ జీవితం ఆధారంగా 'ఓ సాహసి ప్రయాణం' అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నామని... హైదరాబాద్ లో జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని ఆయన తెలిపారు.

More Telugu News