BJP: జైలులో రాజా సింగ్... రేప‌టితో ముగియ‌నున్న‌ సంజాయిషీకి గడువు

  • వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల వ్య‌వ‌హారంలో రాజా సింగ్‌కు బీజేపీ నోటీసులు
  • ఇదే కేసులో అరెస్టయి జైలులో ఉన్న రాజా సింగ్‌
  • సంజాయిషీ ఇచ్చేందుకు గ‌డువు పొడిగించాల‌ని బీజేపీకి రాజా సింగ్ భార్య లేఖ‌
mla raja singh wife writes a letter to bjp to extend deadline for clarification

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల కేసులో అరెస్టయి జైలులో ఉన్న గోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు ఇప్పుడు పెద్ద చిక్కే వ‌చ్చింది. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితులు, పార్టీ నియ‌మావ‌ళిని ధిక్క‌రించి వీడియో విడుద‌ల చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌తో రాజా సింగ్‌పై బీజేపీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ఉల్లంఘించే రీతిలో ఉన్న మీ ప్ర‌వ‌ర్త‌న ఆధారంగా మిమ్మ‌ల్ని పార్టీ నుంచి ఎందుకు బ‌హిష్క‌రించ‌కూడ‌దో తెల‌పాలంటూ రాజా సింగ్‌కు బీజేపీ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల ప్ర‌కారం రేప‌టి లోగా రాజా సింగ్ వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంది.

అయితే ప్ర‌స్తుతం జైలులో ఉన్న రాజా సింగ్ పార్టీ నోటీసుల‌కు వివ‌ర‌ణ ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో రంగంలోకి దిగిన రాజా సింగ్ భార్య... బీజేపీ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘానికి ఓ లేఖ రాశారు. ప్ర‌స్తుతం త‌న భ‌ర్త జైలులో ఉన్నార‌ని, ఈ కార‌ణంగా నిర్దేశిత స‌మ‌యంలో నోటీసుల‌కు వివ‌ర‌ణ ఇచ్చే అవ‌కాశం లేకుండా పోయింద‌ని ఆమె ఆ లేఖ‌లో పేర్కొన్నారు. పార్టీ నోటీసుల‌కు వివ‌ర‌ణ ఇచ్చేందుకు త‌న భ‌ర్త‌కు మ‌రింత గ‌డువు ఇవ్వాల‌ని ఆమె పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘాన్ని అభ్య‌ర్థించారు. రాజా సింగ్ భార్య రాసిన ఈ లేఖ‌పై బీజేపీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్న దానిపై ఆస‌క్తి నెల‌కొంది.

More Telugu News