ఏమాత్రం అవకాశం దొరికినా ధోనీని గమనిస్తుంటాను: హార్దిక్ పాండ్యా

31-08-2022 Wed 16:45
  • ఈ ఏడాది విశేషంగా రాణిస్తున్న పాండ్యా
  • గాయం నుంచి కోలుకున్నాక ఆల్ రౌండర్ గా మెరుపులు
  • ఐపీఎల్ లో కెప్టెన్ గా గుజరాత్ టైటాన్స్ కు టైటిల్
  • ఇటీవల టీమిండియా విజయాల్లో ముఖ్య భూమిక
  • తన ఎదుగుదలతో ధోనీది కీలకపాత్ర అని వెల్లడి
Hardik Pandya says whenever he got a chance and he observed dhoni
ఇటీవల కాలంలో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన 2.0 వెర్షన్ చూపిస్తున్నాడు. ఐపీఎల్ నుంచి మొదలుపెట్టి మొన్నటి పాకిస్థాన్ తో ఆసియాకప్ మ్యాచ్ వరకు పాండ్యా అటు బంతితో, ఇటు బ్యాట్ తో విశేషంగా రాణిస్తున్నాడు. 

ఓ దశలో గాయాలతో కెరీర్ లో అత్యంత గడ్డుకాలం ఎదుర్కొన్న పాండ్యా, అద్భుతమైన రీతిలో పుంజుకుని ఐపీఎల్ లో తాను సారథ్యం వహించిన గుజరాత్ టైటాన్స్ ను టైటిల్ విజేతగా నిలిపాడు. ఆపై టీమిండియా తరఫున పలు వీరోచిత ఇన్నింగ్స్ తో భవిష్యత్ కెప్టెన్ గా మన్ననలందుకుంటున్నాడు. 

తాజాగా, పాండ్యా స్టార్ స్పోర్ట్స్ చానల్ తో మాట్లాడుతూ, క్రికెటర్ గా తన ఎదుగుదలతో మహేంద్ర సింగ్ ధోనీది కీలక పాత్ర అని వెల్లడించాడు. తనకు ఎప్పుడు అవకాశం వచ్చినా ధోనీని గమనిస్తుంటానని, కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటానని తెలిపాడు. ధోనీ ఆలోచనా విధానం, అతడి క్రికెటింగ్ తెలివి... ఇలాంటి విషయాలను పరిశీలిస్తుంటానని, ధోనీలో ఉండే ఆ లక్షణాలనే మైదానంలో తాను కూడా ప్రతిబింబించేందుకు ప్రయత్నిస్తుంటానని పాండ్యా వివరించాడు. 

మైదానంలో చేసిన పొరబాట్లను గుర్తించడం, సరిదిద్దుకోవడం, అవకాశాలను సృష్టించుకోవడం, పరిస్థితుల నుంచి నేర్చుకోవడం... ఇవన్నీ ధోనీలో గమనించానని, తాను కూడా అలవర్చుకున్నానని తెలిపాడు. మీ సన్నిహితుల నుంచి కాదు, మీ సాధన సంపత్తి ద్వారా కాదు... కొన్నిసార్లు వైఫల్యాల నుంచి కూడా నేర్చుకోవచ్చు అని వివరించాడు. అక్కడ ధోనీ ఉన్నా సరే, ఓ వైఫల్యం నేర్పించే పాఠం అంతకంటే ఎక్కువ అని అభిప్రాయపడ్డాడు.