Telangana: పాట్నా చేరుకున్న కేసీఆర్‌... ఎయిర్‌పోర్టులో ఘ‌న స్వాగ‌తం ప‌లికిన బీహార్ సీఎం, డిప్యూటీ సీఎంలు

kcr reaches patna and welconed by bihar cm nitish kumar and deputy cm tejashwi yadav
  • వినాయ‌క చ‌వితి నాడు బీహార్ వెళ్లిన కేసీఆర్‌
  • గ‌ల్వాన్ లోయ అమ‌రుల కుటుంబాల‌కు చెక్కులు పంపిణీ చేయ‌నున్న తెలంగాణ సీఎం
  • జాతీయ రాజ‌కీయాల‌పై నితీశ్ కుమార్‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పనున్న వైనం
వినాయ‌క చ‌వితి నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరి బుధ‌వారం మ‌ధ్యాహ్నం బీహార్ రాజ‌ధాని పాట్నా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేసీఆర్‌కు... బీహార్ సీఎం నితీశ్ కుమార్‌, డిప్యూటీ సీఎం తేజ‌స్వీ యాద‌వ్‌లు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం వారిద్ద‌రూ కేసీఆర్‌ను పాట్నాలోని బీహార్ స‌చివాల‌యానికి తీసుకుని వెళ్లారు. 

గ‌ల్వాన్ లోయలో చైనా సైనికుల‌తో జ‌రిగిన పోరులో మృతి చెందిన జ‌వాన్ల‌కు తెలంగాణ స‌ర్కారు త‌ర‌ఫున ఆర్థిక స‌హాయం ప్ర‌కటించిన కేసీఆర్‌... కొన్ని రాష్ట్రాల్లో ఆ ప‌రిహారం చెక్కుల‌ను పంపిణీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో బీహార్‌కు చెందిన సైనికులు కూడా వీర మ‌ర‌ణం పొంద‌గా వారికి కూడా కేసీఆర్ స‌హాయం అందించ‌నున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్‌ టింబర్‌ డిపోలో ఇటీవల మరణించిన 12 మంది వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తారు. త‌న తాజా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బుధ‌వార‌మే కేసీఆర్ ఈ ప‌రిహారం చెక్కుల‌ను బాధిత కుటుంబాల‌కు అంద‌జేయ‌నున్నారు.

ఇదిలా ఉంటే... ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జేడీయూ అధినేత‌గా ఉన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌పై కీల‌క చ‌ర్చ‌లు జ‌ర‌పనున్నారు. మొన్న‌టిదాకా బీజేపీ పొత్తుతో సాగిన నితీశ్... ఇటీవ‌లే బీజేపీతో తెగ‌దెంపులు చేసుకుని ఆర్జేడీతో క‌లిసి కొత్త స‌ర్కారును ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో నితీశ్ తో కేసీఆర్ చ‌ర్చ‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.
Telangana
TRS
KCR
Bihar
Nitish Kumar
Tejashwi Yadav
JDU
RJD
Patna

More Telugu News