Seema Patra: పనిమనిషి నాలుకతో టాయిలెట్ శుభ్రం చేయించిన బీజేపీ బహిష్కృత మహిళా నేత అరెస్ట్

  • పనిమనిషిని చిత్రహింసలకు గురిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి భార్య సీమా పాత్రా
  • వేడి వస్తువులతో శరీరంపై వాతలు
  • అరెస్టుకు భయపడి పరారీ
  • అదుపులోకి తీసుకున్న ఝార్ఖండ్ పోలీసులు
Suspended BJP leader Seema Patra arrested

బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన బీజేపీ నాయకురాలు, మాజీ ఐఏఎస్ అధికారి భార్య సీమా పాత్రా అరెస్టయ్యారు. తన ఇంట్లో పనిచేస్తున్న గిరిజన పనిమనిషిని చిత్రహింసలకు గురిచేసిన ఆరోపణలపై ఈ వేకువజామున రాంచీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ రోజు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలించనున్నట్టు పోలీసులు తెలిపారు. అరెస్టుకు భయపడిన సీమా పాత్రా పరారయ్యారు. ఆమె కోసం గాలించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఇంట్లోని పనిమనిషి సునీత నాలికతో టాయిలెట్‌ను శుభ్రం చేయించినట్టు సీమా పాత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాక, సునీత శరీరం నిండా గాయాలున్నాయి. సీమ తన శరీరాన్ని వేడి వస్తువులతో కాల్చేవారని సునీత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మాజీ ఐఏఎస్ అధికారి మహేశ్వర్ పాత్రా భార్య అయిన సీమా పాత్రాపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సెక్షన్ 164 కింద మంగళవారం సునీత వాంగ్మూలాన్ని కోర్టులో రికార్డు చేశారు. కాగా, పనిమనిషిపై అమానుషంగా ప్రవర్తించడమే కాకుండా చిత్ర హింసలకు గురిచేసిన వార్తలు వెలుగులోకి రావడంతో ఝార్ఖండ్ బీజేపీ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. 

పని మనిషిని సీమా చిత్రహింసలకు గురిచేసిన వార్తలపై తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ ఆమెను అరెస్ట్ చేయాలంటూ ఝార్ఖండ్ డీజీపీకి లేఖ రాశారు. ఈ ఘటనపై విచారణ జరిపించి నిజం నిగ్గు తేల్చాలని కోరారు.

More Telugu News