Mikhail Gorbachev: సోవియెట్ యూనియన్ చివరి అధినేత మిఖాయిల్ గోర్బచెవ్ కన్నుమూత

Mikhail Gorbachev Soviet leader who ended Cold War dies
  • ప్రచ్ఛన్న యుద్ధాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషించిన గోర్బచెవ్
  • దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన యూఎస్సెస్సార్ చివరి అధ్యక్షుడు
  • జర్మనీ పునరేకీకరణకు పాటుపడిన నాయకుడు
  • సంతాపం తెలిపిన ప్రపంచ నాయకులు
చరిత్ర గతిని మార్చిన ఒక దిగ్గజం నేలను విడిచింది. పశ్చిమ దేశాల్లో సంస్కరణల రూపకర్తగా పేరు గడించిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మిఖాయిల్ గోర్బచెవ్ కన్నుమూశారు. ప్రచ్ఛన్న యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సోవియెట్ యూనియన్ చివరి అధినేతగా చరిత్రకెక్కిన ఆయన 91 ఏళ్ల వయసులో గత రాత్రి కన్నుమూశారు. ప్రచ్ఛన్న యుద్ధాన్ని నివారించడంలో గోర్బచెవ్ విజయం సాధించినప్పటికీ సోవియెట్ యూనియన్ పతనాన్ని మాత్రం ఆపలేకపోయారు. ఆ తర్వాతే రష్యా ఏర్పడింది.

ఐరోపాను విభజించిన ఇనుప తెరను తొలగించి జర్మనీ పునరేకీకరణకు గోర్బచెవ్ పాటుపడ్డారు. అమెరికా, పాశ్చాత్య దేశాలతో ఆయుధ నియంత్రణ ఒప్పందాలను కుదుర్చుకున్న గోర్బచెవ్.. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ గత రాత్రి కన్నుమూసినట్టు రష్యా సెంట్రల్ క్లినికల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

గోర్బచెవ్ మృతికి ప్రపంచవ్యాప్తంగా పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఆయన మృతికి సంతాపం తెలిపినట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ టెలిగ్రామ్ మెసేజ్ పంపనున్నట్టు చెప్పారు. గోర్బచెవ్ చరిత్ర గమనాన్ని మార్చిన గొప్ప నాయకుడని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ కొనియాడారు. విలక్షణమైన నాయకుడని ట్వీట్ చేశారు. స్వేచ్ఛాయుత యూరప్‌కు దారులు తెరిచిన గౌరవప్రదమైన నాయకుడంటూ యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్  లేయన్ పేర్కొన్నారు. గోర్బచెవ్ ధైర్యం, సమగ్రత ప్రశంసనీయమని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.
Mikhail Gorbachev
Russia
USSR
Cold War

More Telugu News