gulam nabi azad: ఆజాద్ దెబ్బకు జమ్మూ కశ్మీర్​లో కాంగ్రెస్ ఖాళీ!

  • గులాం నబీ బాటలో మరో 51 మంది నేతలు
  • కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఆజాద్ కొత్త పార్టీలో చేరేందుకు ఆసక్తి
  • ఇప్పటికే రాజీనామా చేసిన 64 మంది నాయకులు 
Massive jolt to Congress in Jammu and K as 51 leaders set to resign

జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే అగ్రనేత గులాం నబీ ఆజాద్‌ రాజీనామాతో కాంగ్రెస్‌ తీవ్ర ఆందోళనకు గురవుతున్న తరుణంలో ఆ రాష్ట్రానికి చెందిన  51 మంది నేతలు కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఆజాద్‌ కొత్త పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆజాద్ రాజీనామా చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 64 మంది నేతలు పార్టీని వీడారు. ఆజాద్‌కు మద్దతుగా మంగళవారం పార్టీకి రాజీనామా చేసిన వారిలో జమ్మూ కశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్ కూడా ఉన్నారు.  

వాళ్లంతా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తమ రాజీనామా లేఖలు సమర్పించారు. తారా చంద్, మాజీ మంత్రులు అబ్దుల్ మజిద్ వానీ, మనోహర్ లాల్ శర్మ, ఘరు రామ్, మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్‌ సహా పలువురు నాయకులు తమ పార్టీ ప్రాథమిక సభ్యత్వం సహా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఆజాద్‌కు మద్దతుగా సోనియా గాంధీకి లేఖ ద్వారా రాజీనామాలను సమర్పించామని బల్వాన్ సింగ్ తెలిపారు.

జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అయిన 73 ఏళ్ల గులాం నబీ కాంగ్రెస్‌తో తన ఐదు దశాబ్దాల అనుబంధాన్ని శుక్రవారం ముగించారు. కాంగ్రెస్ పూర్తిగా నాశనం అయిందని, పార్టీలో సంప్రదింపుల యంత్రాంగాన్ని కూల్చివేశారంటూ రాహుల్ గాంధీపై ఆయన విరుచుకుపడ్డారు. త్వరలో జమ్మూ కశ్మీర్ నుంచి జాతీయ స్థాయి పార్టీని ప్రారంభిస్తానని ప్రకటించారు. 

జమ్మూ కశ్మీర్లో  మాజీ మంత్రులు, శాసనసభ్యులు సహా దాదాపు డజనుకు పైగా ప్రముఖ కాంగ్రెస్‌ నాయకులు, వందలాది మంది పంచాయతీరాజ్‌ సంస్థ (పిఆర్‌ఐ) సభ్యులు, మున్సిపల్‌ కార్పొరేటర్లు, జిల్లా, బ్లాక్‌ స్థాయి నాయకులు ఇప్పటికే కాంగ్రెస్‌ను వీడి ఆజాద్‌కు మద్దతు ప్రకటించారు. ఆజాద్ దెబ్బకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి వస్తోంది.

More Telugu News