Jharkhand: యువతిని తగలబెట్టిన నిందితుడు నవ్వులు చిందిస్తూ పోలీసు జీపెక్కిన వైనం.. వైరల్ అవుతున్న వీడియో ఇదే!

Man who set girl on fire in Dumka seen smiling in police custody
  • నిద్రిస్తున్న యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించిన నిందితుడు
  • చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితురాలు
  • నిందితుడిని, అతడికి పెట్రోలు అందించిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • నవ్వుతున్న నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
తన ప్రేమను నిరాకరించిన యువతిని పెట్రోలు పోసి తగలబెట్టిన యువకుడు పోలీసులకు చిక్కి నవ్వుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఏదో ఘనకార్యం చేసినట్టు ఆ నవ్వులేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఝార్ఖండ్‌లోని దుమ్కా పట్టణానికి చెందిన నిందితుడి పేరు షారూక్. ప్రేమిస్తున్నానంటూ 12వ తరగతి చదువుతున్న అమ్మాయి వెంట పడ్డాడు. అతడి ప్రేమను ఆమె తిరస్కరించడంతో కోపంతో రగిలిపోయిన షారూక్ ఆమెను తుదముట్టించాలని పథకం వేశాడు. 

గత మంగళవారం ఆమె నిద్రిస్తున్న సమయంలో కిటికీ నుంచి పెట్రోలు చల్లి నిప్పంటించి పరారయ్యాడు. 90 శాతం గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాధితురాలు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు షారూక్‌తోపాటు అతడికి పెట్రోలు అందించిన మరో యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

ఆ తర్వాత షారూక్ చేతులకు బేడీలు వేసిన పోలీసులు వాహనం వద్దకు తీసుకెళ్తున్న సమయంలో చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. ఈ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాలకెక్కి వైరల్ అయింది. సిగ్గులేకుండా నవ్వుతున్నాడని కొందరు, కఠిన శిక్షలు విధించాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
Jharkhand
Dumka
Viral Videos
Crime News

More Telugu News