Pawan Kalyan: ఏపీలో తెలుగు భాషను దూరం చేసే ప్రణాళికలపై భాషాభిమానులు, విద్యావేత్తలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది: పవన్ కల్యాణ్

  • నేడు గిడుగు రామ్మూర్తి జయంతి
  • తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న వైనం
  • ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే సాగాలన్న పవన్
  • కేంద్ర ప్రభుత్వ విద్యావిధానాన్ని విస్మరించరాదని స్పష్టీకరణ
  • అన్ని వర్గాల వారు భాషా పరిరక్షణకు పూనుకోవాలని పిలుపు
Pawan Kalyan responds on Telugu Language Day

నేడు తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. భావితరాలకు తెలుగు భాషను వారసత్వ సంపదగా అందించేలా అందరూ సంకల్పించాలని, తద్వారా తెలుగు భాషా దినోత్సవానికి సార్థకత చేకూర్చుదామని పిలుపునిచ్చారు. 

కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా.... తెలుగువాళ్లం అని చెప్పుకోవడంలో భావోద్వేగం, సోదరభావం వ్యక్తమవుతాయని తెలిపారు. అందుకు ఆలంబన మన భాషేనని పేర్కొన్నారు. అటువంటి అమ్మ భాషను మనందరం అనునిత్యం గౌరవించాలని వెల్లడించారు. 

గ్రాంథికంలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల బాట పట్టించి, వ్యావహారిక భాషకు పట్టంకట్టిన మహనీయులు గిడుగు వెంకట రామ్మూర్తి గారు అని పవన్ కల్యాణ్ కొనియాడారు. ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

వ్యావహారిక తెలుగు భాష అందాన్ని, విలువను గుర్తించి ఆ భాషను రచనల్లోకి తీసుకువచ్చేందుకు గిడుగు రామ్మూర్తి ఉద్యమ స్ఫూర్తితో చేసిన కృషి కారణంగానే మన భాష విరాజిల్లుతోందని పవన్ కల్యాణ్ వివరించారు. విద్యార్థి దశ నుంచే మన భాషను బాలలకు నేర్పించాలని, ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే సాగాలన్న కేంద్ర ప్రభుత్వ విద్యావిధానాన్ని విస్మరించకూడదని స్పష్టం చేశారు. 

ఏపీలో తెలుగు భాషను దూరం చేసే ప్రణాళికలపై భాషాభిమానులు, విద్యావేత్తలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు తెలుగు నేర్పించడమే కాదు, పాలనా వ్యవహారాల్లో సైతం తెలుగు భాష వినియోగాన్ని పెంచాలని హితవు పలికారు. అన్ని వర్గాల వారు తెలుగు భాష పరిరక్షణకు సన్నద్ధమైతేనే గిడుగు వెంకట రామ్మూర్తికి నిజమైన నివాళి ఇవ్వగలమని పేర్కొన్నారు.

More Telugu News