Team India: పాకిస్థాన్​ తో మ్యాచ్ గురించి భారత ఆటగాళ్లు ఏమంటున్నారు? బీసీసీఐ ప్రత్యేక వీడియో విడుదల

India players react to match against Pakistan in Asia Cup 2022
  • ప్రత్యర్థి గురించి ఎక్కువగా ఆలోచించడం లేదన్న కెప్టెన్ రోహిత్
  • పాకిస్థాన్ తో పోరును మరో మ్యాచ్ లానే చూస్తామంటున్న కోహ్లీ
  • ఎప్పట్లానే అధిక ఒత్తిడితో కూడిన మ్యాచ్ అంటున్న కేఎల్ రాహుల్
ఆసియా క‌ప్ లో భాగంగా ఆదివారం రాత్రి భార‌త్‌ - పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ పోరు కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియం వేదిక‌గా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవనుంది. ఇందులో ఎవరు గెలుస్తారనే దానిపై అనేక చర్చలు నడుస్తుండగా.. భారత ఆటగాళ్లు మాత్రం దీన్ని మరో కోణంలో చేస్తున్నారు. బీసీసీఐ ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ పై స్పందించారు.

కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ తన జట్టు దృష్టి పెద్ద లక్ష్యాలపైనే ఉంటుందని చెప్పాడు. ‘ఈ మ్యాచ్ కోసం మేం మెరుగ్గా సన్నద్దం అయ్యాం. మేం ప్రత్యర్థి గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. ఒక జట్టుగా మేం ఏం సాధించాలనేదే మాకు ముఖ్యం. ఈ మ్యాచ్లో  సవాల్ తప్పదు. దానికి మేం సిద్ధంగా ఉండాలి‘ అని రోహిత్ అన్నాడు.

కోహ్లీ స్పందిస్తూ.. ‘నేను గతంలో చాలాసార్లు చెప్పినట్లు మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు అది మాకు మరో మ్యాచ్ మాత్రమే. ఈ పోరుపై బయట నెలకొన్న వాతావరణం మాలో కూడా భావోద్వేగాలను రగిలించలగదు. కానీ,  దాన్ని గ్రౌండ్లోకి వచ్చేముందు ఉత్సాహ పరిచే అంశంగానే చూడాలి. ఒకసారి మైదానంలో అడుగు పెట్టాక ఎప్పట్లానే ఆడాలి’అని పేర్కొన్నాడు.
 
టీమిండియా వైస్ కెప్టెన్ లోకేశ్ రాహుల్ మాట్లాడుతూ ‘గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ బలమైన జట్టుగా ఉంది. ఈ మధ్య పాక్ క్రికెటర్లు అద్భుతమైన క్రికెట్ ఆడారు. ఎప్పట్లానే ఇది అధిక ఒత్తిడితో కూడిన మ్యాచ్’ అని అభిప్రాయపడ్డాడు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ల చుట్టూ ఎప్పుడూ సందడి ఉంటుందని, ఆటగాళ్లు  మాత్రం తమ అత్యుత్తమ ప్రదర్శనపై దృష్టి సారిస్తారని రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా అన్నారు.

 ‘ఇక్కడ ఆసక్తికరమైన వాతావరణం ఉంది. మ్యాచ్ పై కొంచెం హైప్ ఉంది. ఒక ఆటగాడిగా, మేము మా 100 శాతం అందించడానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే చాలా ఒత్తిడి, అంచనాలు ఉన్నాయి’అని పంత్ అన్నాడు. హార్దిక్ మాట్లాడుతూ.. ‘బయట చాలా హైప్ ఉంది. ఈ మ్యాచ్ ఎంత మందితో భావోద్వేగాలు రగిలిస్తుందని మేం అర్థం చేసుకున్నాం. కానీ, మేం బయటి శబ్దాన్ని బయటే ఉండేలా చూసుకోవాలి. మ్యాచ్లో మాకు నిజంగా అవసరమైన వాటిపై దృష్టి పెట్టాలి’ అని అభిప్రాయపడ్డాడు. .
Team India
Pakistan
asia cup
india vs pakistan
BCCI
Virat Kohli
Rohit Sharma

More Telugu News