India: మొట్టమొదటిసారిగా... ఐరాస భద్రతామండలిలో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసిన భారత్

  • ఉక్రెయిన్ పై దండెత్తిన రష్యా
  • పలుమార్లు ఐరాసలో ఓటింగ్
  • తటస్థంగా ఉంటూ వచ్చిన భారత్
  • ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రసంగం కోసం తాజా ఓటింగ్
  • రష్యా రాయబారి విజ్ఞప్తిని తోసిపుచ్చిన భారత్
India for the first time voted against Russia in UN Security Council

భారత్, రష్యా సుదీర్ఘకాలంగా మిత్రదేశాలు. సైనిక సాధన సంపత్తి కోసం భారత్ ఎక్కువగా ఆధారపడే దేశం రష్యానే. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రకు దిగినప్పటికీ... ఆ మిత్రధర్మంతోనే ఇన్నాళ్లు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశాల్లో భారత్ తటస్థంగా ఉంటోంది. కానీ, తాజాగా భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్ లో భారత్... రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఉక్రెయిన్ అంశంలో రష్యాను వ్యతిరేకిస్తూ ఓటు వేయడం భారత్ కు ఇదే తొలిసారి. 

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీని భద్రతామండలిని ఉద్దేశించి ప్రసంగించడానికి ఆహ్వానించాలా? వద్దా? అనే అంశంపై ఈ ఓటింగ్ నిర్వహించారు. అయితే భద్రతామండలిలో ప్రసంగానికి జెలెన్ స్కీని ఆహ్వానించడాన్ని వ్యతిరేకించాలంటూ ఐరాసలో రష్యా రాయబారి వాసిలీ ఏ నెబెంజియా సభ్యదేశాలను అర్థించారు. అయితే, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెలెన్ స్కీ ప్రసంగానికి అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనకు భారత్ సహా 13 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, రష్యా ఒక్కటి వ్యతిరేకంగా ఓటు వేసింది. చైనా ఈ ఓటింగ్ కు దూరంగా ఉంది. 

కాగా, భద్రతామండలిలో జెలెన్ స్కీ ప్రసంగానికి తమకేమీ అభ్యంతరం లేదని, అయితే, ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా కాకుండా వ్యక్తిగతంగా వచ్చి ప్రసంగించాలని రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా అన్నారు. కరోనా సమయంలో ఇలాంటి వర్చువల్ కార్యక్రమాలు నిర్వహించారని, అయితే అవి అనధికార కార్యక్రమాలుగా ముద్ర పడ్డాయని గుర్తుచేశారు. కరోనా సంక్షోభం ముగిశాక భద్రతామండలి కార్యక్రమాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని, ఇప్పుడు వర్చువల్ విధానంలో ప్రసంగించడంలో అర్థంలేదని నెబెంజియా వాదించారు. 

భారత్ కు ఐరాస భద్రతామండలిలో ఇంకా శాశ్వత సభ్యత్వం రాలేదు. ప్రస్తుతం రెండేళ్ల ప్రాతిపదికన నాన్-పర్మినెంట్ సభ్యదేశంగా కొనసాగుతోంది. ఈ గడువు డిసెంబరుతో ముగియనుంది.

More Telugu News