రేపు పదవీ విరమణ చేయనున్న సీజేఐ ఎన్వీ రమణ... ఇవాళ ఆయన విచారించిన ఐదు కీలక కేసుల వివరాలు ఇవిగో!

  • రేపటితో ముగియనున్న ఎన్వీ రమణ పదవీకాలం
  • నేడు ముమ్మరంగా విచారణలు
  •  
  • పలు ఆదేశాలు, నోటీసుల జారీ
Justic NV Ramana penultimate day hearings

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం మరొక్క రోజు మిగిలుంది. సీజేఐగా ఆయన రేపు (ఆగస్టు 26) పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ నేడు పలు కీలక కేసులను విచారించారు. వాటి వివరాలు...


1. బిల్కిస్ బానో అత్యాచార దోషులకు క్షమాభిక్ష కేసు

2002లో గుజరాత్ అల్లర్ల సందర్భంగా ముస్లిం మహిళ బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. అయితే, ఈ కేసులో జీవితఖైదు పడిన 11 మందిని ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష కింద విడుదల చేశారు. దాంతో గుజరాత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో, సీపీఎం మహిళా నేత సుభాషిణి అలీ, పాత్రికేయురాలు, ఫిలింమేకర్ రేవతి లాల్, మాజీ ఫిలాసఫీ ప్రొఫెసర్, ఉద్యమకారిణి రూప్ రేఖా వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరు దాఖలు చేసిన పిటిషన్ ను సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ విక్రమ్ నాథ్ లతో కూడిన ధర్మాసనం నేడు విచారించింది. గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆ 11 మంది దోషులను ఈ కేసులో వాదులుగా చేర్చాలని స్పష్టం చేశారు.

2. పెగాసస్ కేసు

ఇజ్రాయెల్ కంపెనీ నుంచి భారత కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన పెగాసస్ సాఫ్ట్ వేర్ సాయంతో ప్రముఖుల ఫోన్లపై నిఘా వేస్తున్నారని కొంతకాలం కిందట తీవ్ర దుమారం రేగింది. కేంద్ర నిఘా నేత్రం కింద అనేకమంది పాత్రికేయులు,రాజకీయపక్ష నేతలు, సామాజిక ఉద్యమకారులు, న్యాయవాదులు, అధికారులు, ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఇతరులు కూడా ఉన్నారంటూ ఆరోపణలు వినిపించాయి. పెగాసస్ కుంభకోణంలో నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కేసుకు సంబంధించిన విచారణను కూడా నేడు ఎన్వీ రమణ బెంచ్ చేపట్టింది. 

కాగా, తాము పరీక్షించిన 29 మొబైల్ ఫోన్లలో పెగాసస్ స్పైవేర్ కనిపించలేదని ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ సుప్రీంకోర్టుకు నివేదించింది. అయితే, ఆ 29 ఫోన్లలో 5 ఫోన్లలో ఓ మాల్వేర్ కనిపించిందని, కానీ అది పెగాసస్ స్పైవేర్ కాదని సుప్రీంకోర్టు నివేదికలోని అంశాలను గుర్తించింది. అదే సమయంలో, భారత కేంద్ర ప్రభుత్వం తాము ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి సహకరించలేదన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తించింది. ఈ నివేదికను సుప్రీంకోర్టు వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేసే అవకాశాలున్నాయని ఎన్వీ రమణ ధర్మాసనం సూచనప్రాయంగా తెలిపింది.

3. కార్తీ చిదంబరం మనీ లాండరింగ్ కేసు

గతంలో కాంగ్రెస్ నేత చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఓ చైనా కంపెనీ వ్యక్తులకు వీసాలు ఇప్పించారని, అందుకు బదులుగా భారీగా ముడుపులు అందుకున్నారని సీబీఐ అభియోగాలు నమోదు చేయగా, ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కార్తీ చిదంబరం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ నేడు ఎన్వీ రమణ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. ఈడీ అభియోగాలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు జులై 27న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కార్తీ చిదంబరం తన తాజా పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. 

దీనిపై పరిశీలన చేపట్టిన ఎన్వీ రమణ ధర్మాసనం నేడు కేంద్రానికి రెండు నిర్దిష్ట అంశాలపై నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడికి ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) ఇవ్వకపోవడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నేరారోపణలు నిరూపితం కానంతవరకు ఎవరినీ దోషిగా పేర్కొనలేమని, ఈ కేసులో ఇది తిరోమగన దిశలో కనిపిస్తోందంటూ ప్రస్తావన చేసింది. ఈ రెండు అంశాలపై కేంద్రం నుంచి వివరణ కోరింది. 

4. ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వైఫల్యం కేసు

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జనవరి 5న పంజాబ్ పర్యటనకు వెళ్లగా, ఆయన కాన్వాయ్ లోకి నిరసనకారులు చొరబడడం, కాన్వాయ్ నిలిచిపోవడం తెలిసిందే. ఇది భద్రతా ఉల్లంఘనల కిందికి వస్తుందంటూ లాయర్స్ వాయిస్ అనే సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రధాని భద్రత వ్యవస్థలో ఉల్లంఘనలపై కోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని ఆ సంస్థ కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన విచారణ కూడా నేడు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ ముందుకు వచ్చింది. 

ఈ సందర్భంగా... ఫిరోజ్ పూర్ సీనియర్ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) శాంతిభద్రతలను కాపాడే క్రమంలో తన విధి నిర్వహణలో విఫలం అయ్యారంటూ ఇందు మల్హోత్రా కమిటీ సుప్రీంకోర్టుకు నివేదించింది. అంతేకాదు, కమిటీ సూచించిన మేరకు ప్రధాని భద్రతకు తీసుకోవాల్సిన మరిన్ని చర్యలను కూడా ఎన్వీ రమణ బెంచ్ పరిగణనలోకి తీసుకుంది.

5. తీస్తా సెతల్వాద్ బెయిల్ కేసు

2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, తదితరుల చుట్టూ ఉచ్చు బిగించేందుకు తప్పుడు పత్రాలు సృష్టించారంటూ సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్ ను అరెస్ట్ చేయడం తెలిసిందే. దాంతో బెయిల్ కోరుతూ తీస్తా సెతల్వాద్ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను కూడా జస్టిస్ ఎన్వీ రమణ నేడు విచారించారు. 

ఈ కేసులో ఆగస్టు 22 నాటి విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయగా... కేంద్ర ప్రభుత్వం తమకు మరికాస్త సమయం కావాలని నేడు సుప్రీంకోర్టును కోరింది. దాంతో ఎన్వీ రమణ బెంచ్ ఈ కేసును ఆగస్టు 30కి వాయిదా వేసింది.

More Telugu News