nitin Gadkari: త్వరలో టోల్ ప్లాజాలు ఉండవు.. నంబర్ ప్లేట్ ఆధారంగా బ్యాంకు ఖాతా నుంచి ఛార్జీ వసూలు! 

  • ప్రయోగాత్మకంగా నూతన విధానం పరీక్ష
  • త్వరలో ఈ విధానానికి మళ్లనున్నట్టు కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి 
  • కెమెరాలు రీడ్ చేసే విధంగా నంబర్ ప్లేట్లు ఉండాలన్న మంత్రి
No toll plazas cameras to read number plates deduct toll

ఫాస్టాగ్ లు వచ్చిన తర్వాత టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గడాన్ని చూస్తున్నాం. అసలు టోల్ ప్లాజాలే లేకపోతే? ఎంతో సమయం ఆదా అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యం కూడా ఇదే. టోల్ ప్లాజాలను పూర్తిగా తొలగించే ప్రణాళిక దిశగా అడుగులు వేస్తోంది. ఈ వివరాలను కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 

టోల్ ప్లాజాలు లేకపోతే టోల్ చార్జీ ఎలా వసూలు చేస్తారనే సందేహం వచ్చే ఉంటుంది. నంబర్ ప్లేట్ ను రీడ్ చేసే కెమెరాలు ఉంటాయి. వాటి ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి ఛార్జీని వసూలు చేస్తారు. ప్రయోగాత్మకంగా దీన్ని పరీక్షించే ప్రక్రియ కొనసాగుతున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించినట్టు చెప్పారు. ఫాస్టాగ్ విధానంలో కార్లపై ఆర్ఎఫ్డీ ట్యాగ్ స్టిక్కర్ వేస్తుండడం తెలిసిందే. నంబర్ ప్లేట్లను రీడ్ చేసే విధానంలో వీటి అవసరం ఉండదు.

‘‘కంపెనీ ఫిట్ చేసిన నంబర్ ప్లేట్లతోనే కార్లు రోడ్లపైకి రావాలని 2019లో నిబంధనలు తెచ్చాం. గత నాలుగేళ్లలో రోడ్లపైకి వచ్చిన కార్ల నంబర్ ప్లేట్లు భిన్నంగా ఉంటున్నాయి. కార్లకు ఈ తరహా నంబర్ ప్లేట్లు లేకపోతే నిర్ణీత సమయంలోగా వాటిని అమర్చుకునే విధంగా నిబంధనలు తేవాలి’’ అని మంత్రి వివరించారు. ప్రస్తుతం టోల్ ఛార్జీల్లో 97 శాతం అంటే సుమారు రూ.40,000 కోట్లు ఫాస్టాగ్ ల ద్వారా వసూలు అవుతున్నట్టు మంత్రి గడ్కరీ తెలిపారు. 

ఫాస్టాగ్ లు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ తగ్గుముఖం పట్టినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడ్ కెమెరాల విధానంతో వాహనాలకు ఆటంకాలు మరింత తగ్గి, సాఫీ ప్రయాణానికి వీలు కలగనుంది.

More Telugu News