Elephant: బురదగుంటలో చిక్కుకుపోయిన గున్న ఏనుగు.. ఆడ ఏనుగు ఎలా రక్షించిందో చూడండి!

Baby elephant gets help from females in the herd to get out of a ditch
  • ఏనుగుల మధ్య అద్భుతమైన బాండింగ్ ఉంటుందన్న సుశాంత్ నందా
  • మందలోని ఏనుగులన్నింటికీ ఆడ ఏనుగు తల్లిలా వ్యవహరిస్తుందన్న అధికారి
  • గున్న ఏనుగును రక్షించేందుకు తల్లి, అత్తలు ఒక్క చోట చేరాయని కామెంట్ 
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా షేర్ చేసే వీడియోలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వన్యప్రాణుల జీవన విధానాన్ని అవి కళ్లకు కడతాయి. ఆలోచింపజేస్తాయి.. ఔరా అనిపిస్తాయి. తాజాగా అలాంటి వీడియోనే మరో దానిని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 

బురదగుంటలో చిక్కుకుపోయిన గున్న ఏనుగును ఓ ఆడ ఏనుగు రక్షించే వీడియో ఇది. మందతో కలిసి వెళ్తున్న గున్న ఏనుగు బురదగుంటలో చిక్కుకుపోయి పైకి రాలేక ఇబ్బంది పడింది. పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఓ ఆడ ఏనుగు రంగంలోకి దిగింది. తన తొండంతో దానిని బురదగుంట నుంచి బయటకు లాగే ప్రయత్నం చేసింది. అయినా ఫలితం లేకపోవడంతో ఓ కాలును గుంటలో వేసి తొండంతో పిల్ల ఏనుగును పైకి లాగేందుకు ప్రయత్నించింది. అది ఆ ప్రయత్నంలో ఉండగానే మరో ఏనుగు దానిని తొండంతో అమాంతం పైకి లాగేసింది.

ఈ వీడియోను షేర్ చేసిన సుశాంత్ నందా.. ఏనుగుల మధ్య అద్భుతమైన బంధం ఉంటుందని రాసుకొచ్చారు. మందలోని ఆడ ఏనుగు అందులోని పిల్ల ఏనుగులు అన్నింటికీ తల్లిలా వ్యవహరిస్తుందన్నారు. బురదలో చిక్కుకున్న గున్న ఏనుగును రక్షించేందుకు తల్లి, అత్తలు ఒక్క చోట చేరాయని, ఇది ఎంత మనోహరంగా ఉందో తెలుసుకునేందుకు మీరు కూడా చూడాలని ఆయన దానికి క్యాప్షన్ తగిలించారు. 

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియోకు ఇప్పటికే 29 వేల వీక్షణలు లభించాయి. కామెంట్లు అయితే చెప్పక్కర్లేదు. ఈ వీడియో తమ హృదయాలను కదిలించిందని కొందరు అంటే.. తమ గుంపులోని ఏ ఒక్క ఏనుగు తప్పిపోకుండా అవి ఎంత జాగ్రత్తగా ఉంటాయో చెప్పేందుకు ఇదో ఉదాహరణ అని మరికొందరు రాసుకొచ్చారు.
Elephant
Susanta Nanda
IFS
Viral Videos

More Telugu News