ముగిసిన మునావ‌ర్ ఫారూఖీ షో... క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య కొన‌సాగిన షో

20-08-2022 Sat 20:15
  • 2.30 గంట‌ల పాటు జ‌రిగిన షో
  • శిల్ప‌క‌ళా వేదిక ప‌రిస‌రాల్లో వేలాది మంది పోలీసుల‌తో ప‌హారా
  • సెల్ ఫోన్లు, వాట‌ర్ బాటిళ్ల‌ను అనుమ‌తించ‌ని పోలీసులు
Munawar Faruqui hyderabad show concludes peacefully
స్టాండ‌ప్ కామెడీ స్టార్ మునావ‌ర్ షో హైద‌రాబాద్‌లో శ‌నివారం రాత్రి ముగిసింది. న‌గ‌రంలోని శిల్ప‌క‌ళా వేదిక కేంద్రంగా సాగిన ఈ షో... దాదాపుగా 2.30 గంట‌ల పాటు కొన‌సాగింది. త‌న షోల‌లో హిందూ దేవుళ్ల‌ను కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేస్తాడంటూ ఫారూఖీపై ఆరోప‌ణ‌లు ఉన్న నేప‌థ్యంలో హైద‌రాబాద్ షో నిర్వ‌హ‌ణ‌పై దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది. అంతేకాకుండా ఫారూఖీ షోను అడ్డుకుని తీర‌తామంటూ బీజేపీ శ్రేణులతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన హెచ్చ‌రిక‌ల‌తోనూ షో నిర్వ‌హ‌ణ‌పై ఆందోళ‌న రేకెత్తింది.

అయితే ముందు జాగ్రత్త చ‌ర్య‌ల కింద శిల్ప‌క‌ళా వేదిక ప‌రిస‌రాల్లో వేలాది మంది పోలీసుల‌ను మోహ‌రించిన హైద‌రాబాద్ పోలీసు అధికారులు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను క‌ల్పించారు. అంతేకాకుండా షో స‌మ‌యంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా ప్రేక్ష‌కులు త‌మ వెంట సెల్ ఫోన్ల‌ను గానీ, వాట‌ర్ బాటిళ్ల‌ను గానీ పోలీసులు అనుమ‌తించ‌లేదు. షోను అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు య‌త్నించినా... పోలీసులు వారిని అరెస్ట్ చేయ‌డంతో ప్ర‌శాంతంగానే షో ముగిసింది.