బిడ్డా అమిత్​ షా.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు.. మునుగోడు సభలో కేసీఆర్​ సవాల్​!

20-08-2022 Sat 16:59
  • కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎందుకు తేల్చడం లేదని నిలదీసిన కేసీఆర్
  • ఇప్పుడు మునుగోడుకు అమిత్ షా ఎందుకు వస్తున్నారని ప్రశ్న
  • మునుగోడు నుంచి ఢిల్లీ దాకా ప్రగతిశీల శక్తుల ఐక్యత కొనసాగాలని వ్యాఖ్య
CM Kcr speech at Munugodu rally
తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడి ఎనిమిదేళ్లు అయిందని.. ఇప్పటికీ కృష్ణా నదిలో నీటి వాటా తేల్చకుండా తాత్సారం చేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నీటి వాటాలు ఎందుకు తేల్చడం లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వ విధానం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీరుపై పోరాడుతామన్నారు. పోరాటాలు తెలంగాణకు కొత్త కాదని.. కొట్లాడటం మొదలుపెడితే ఎక్కడిదాకా అయినా వస్తామని వ్యాఖ్యానించారు. మునుగోడు బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీపై మండిపడ్డారు.

మునుగోడు నుంచి ఢిల్లీ దాకా పోరాటం
‘‘దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను, సమాజాన్ని విభజించే విద్వేష విధానాలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై చర్చిస్తున్నాం. దేశాన్ని, ప్రజలను ఎలా కాపాడుకోవాలనే దానిపై ఐదారు నెలలుగా తలలు బద్దలు కొట్టుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితులతో దేశం యొక్క జీవిక దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రగతిశీల, క్రియాశీల శక్తులు ఏకం కావాలని నిర్ణయించుకున్నాం. పేదలు, రైతుల బతుకులు బాగుపడేదాకా పోరాడుతాం. దేశంలో ప్రగతిశీల శక్తులన్నింటినీ ఒకటి చేసి పోరాటం కొనసాగిస్తాం. ఈ పోరాటం ఒక్క రోజుతో ఆగేది కాదు. ఈ ఉప ఎన్నికకే పరిమితం కాదు. మునుగోడు నుంచి ఢిల్లీ దాకా సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్ సహా మిగతా క్రియాశీల శక్తులన్నీ కలిసి పోరాడుతాం” అని కేసీఆర్ పేర్కొన్నారు.

నీటి వాటా తేల్చడం లేదేం?
‘‘తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడి ఎనిమిదేళ్లు అయింది. కృష్ణా నదిలో నీటి వాటా తేల్చాలని కోరితే ప్రధాని నరేంద్ర మోదీ తేల్చడం లేదు. ఎందుకు తేల్చడం లేదు? ఇప్పుడు మునుగోడుకు ఎందుకు వస్తున్నారు. మా నీటి వాటా మాకు ఇవ్వనందుకే అమిత్ షా తెలంగాణకు వస్తున్నారా? బిడ్డా.. అమిత్ షా సమాధానం చెప్పాలి. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకపోవడానికి కారణమేంటో చెప్పాలి. మా నీటి వాటా తేల్చితే అందుకు అనుగుణంగా ప్రాజెక్టులను పూర్తిచేసుకుంటాం. కానీ తేల్చకుండా అడ్డం ఎందుకు పడుతున్నారు?” అని కేసీఆర్ ప్రశ్నించారు.

మీ చేతగానితనం ఏమిటో చెప్పండి..
‘‘పంద్రాగస్టు నాడు ప్రధాన మంత్రి మాట్లాడితే మైకులు పగలిపోయాయి. అందులో ఒక్క మాట అయినా మంచి మాట ఉందా? బీజేపీ నేతలుగానీ, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిగానీ, రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తిగానీ ఢిల్లీ వెళ్లి.. తెలంగాణకు కృష్ణా నీటి వాటా తేల్చడం లేదేమని అడగగలరా? లేదు. కానీ రేపు డోలు, బాజాలు పట్టుకుని అమిత్ షాను మునుగోడుకు తీసుకొస్తారట. నేను కేంద్ర హోం మంత్రిని డిమాండ్ చేస్తున్నా.. మీరు కృష్ణా జలాల వాటా ఎందుకు తేల్చడం లేదు? ఈ విషయంలో మీ కేంద్ర ప్రభుత్వ విధానం ఏమిటో సమాధానం చెప్పాలి. మీ దద్దమ్మ, చేతగానితనం ఏమిటో రేపు మునుగోడు సభలో చెప్పాలని డిమాండ్ చేస్తున్నా..” అని కేసీఆర్ మండిపడ్డారు.