కోహ్లీ నుంచి సెంచరీలు ఆశించడమే అసలు సమస్య: స్పిన్నర్ చాహల్

20-08-2022 Sat 11:12
  • వెయ్యి రోజులుగా శతకం సాధించని విరాట్ కోహ్లీ 
  • సెంచరీ లేకపోయినా జట్టుకు ఉపయోగపడుతున్నాడన్న చాహల్
  • అతని విలువైన ఇన్నింగ్స్ లు గుర్తించలేకపోతున్నమని వ్యాఖ్య
Problem is we just think about his 100s Yuzvendra Chahal on Virat Kohli
టీమిండియా మాజీ కెప్టెన్, సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫామ్ లో ఉన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ పెద్దగా ప్రభావం చూపెట్టలేకపోతున్న కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసి వెయ్యి రోజులు గడిచిపోయింది. దీంతో అతనిపై విమర్శలు వస్తున్నాయి. అయితే, టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వీటిని ఖండించాడు.

ఇటీవలి కాలంలో కోహ్లీ తన బ్యాట్‌తో జట్టుకు అవసరమైన పరుగులు చేస్తూనే ఉన్నాడని చెప్పాడు. కేవలం అతని సెంచరీలపై దృష్టి కేంద్రీకరించినప్పుడే సమస్య తలెత్తుతుందని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ నుంచి శతకం కోరుకుంటున్న అభిమానులు ఈ సమయంలో అతను చేసిన విలువైన ఇన్నింగ్స్ లను మరిచిపోతారని అన్నాడు. 

‘కోహ్లీకి టీ20ల్లో 50 సగటు ఉంది. అతను రెండు టీ20 ప్రపంచ కప్‌లలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. తను అన్ని ఫార్మాట్లలో కలిపి 70 సెంచరీలు చేశాడు. అన్ని ఫార్మాట్లలో అతని సగటు బాగుంది. కానీ, ఇక్కడ సమస్య ఏమిటంటే, మనమంతా అతని సెంచరీల గురించే చూస్తున్నాం. తను నెలకొల్పిన ప్రమాణాలు అలాంటివి మరి. అయితే, ఈ సమయంలో అతను చేస్తున్న 60-70 పరుగుల విలువైన సహకారాల గురించి మాట్లాడము’ అని చాహల్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ లో కోహ్లీ పరుగులు చేస్తున్నప్పుడు అతనికి బౌలింగ్ చేసేందుకు ప్రతీ బౌలర్ వెనుకంజ వేస్తాడని చాహల్ చెప్పాడు.