రేపు విజ‌య‌వాడ‌కు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌... సీఎం జ‌గ‌న్‌తో క‌లిసి కోర్టు భ‌వ‌నాల‌ను ప్రారంభించనున్న సీజేఐ

19-08-2022 Fri 17:53
  • తిరుమ‌ల‌లో వెంక‌న్న‌ను ద‌ర్శించుకున్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌
  • రాత్రికి తిరుప‌తిలో బ‌స చేయ‌నున్న సీజేఐ
  • రేపు విజయవాడలో సిటీ సివిల్ కోర్టుల భ‌వ‌నాన్ని ప్రారంభించనున్న చీఫ్ జస్టిస్  
cji justice nv ramana inaugurates vijayawada city civil courts new buildings with ap cm ys jagan
భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప్ర‌స్తుతం ఏపీలో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నార్థం గురువారం రాత్రి తిరుమ‌ల చేరుకున్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ శుక్ర‌వారం తిరుమ‌లేశుడిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం మ‌హాత్మా గాంధీపై రాసిన ఓ పుస్త‌కాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు. రాత్రి తిరుప‌తిలోనే బ‌స చేయ‌నున్న‌ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ శ‌నివారం విజ‌య‌వాడ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేర‌నున్నారు.

విజ‌య‌వాడ‌లోని సిటీ సివిల్ కోర్టుల భ‌వ‌న ప్రాంగ‌ణంలో నూత‌నంగా బ‌హుళ అంత‌స్తుల‌తో కూడిన సిటీ సివిల్ కోర్టుల భ‌వ‌న స‌ముదాయాన్ని ఏపీ ప్ర‌భుత్వం ఇటీవ‌లే నిర్మించిన సంగ‌తి తెలిసిందే. రేప‌టి విజ‌య‌వాడ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో క‌లిసి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నూత‌న కోర్టుల భ‌వ‌న స‌ముదాయాన్ని ప్రారంభించన్నారు.