చిన్నారి షూ పడేసుకుంటే తీసిచ్చిన ఏనుగు.. వైరల్​ వీడియో ఇదిగో!

18-08-2022 Thu 16:52
  • చైనాలోని షాంగ్ డోంగ్ ప్రావిన్స్ లో ఉన్న ఓ జూలో విశేషం
  • ఓ చిన్నారి షూ ఏనుగుల ఎన్ క్లోజర్ లో పడిన వైనం
  • తొండంతో దానిని తీసిచ్చిన ఏనుగు..
  • ఇంటర్నెట్ లో వీడియో వైరల్
Elephant returns shoe that fell in enclosure
సాధారణంగా అడవి జంతువుల్లో చాలా వరకు మనుషులను చూస్తే అయితే భయపడతాయి, లేకుంటే భయపెడతాయి. ఇక ఏనుగులు నిజానికి ప్రశాంతంగా ఉండే జీవులే అయినా వాటి భారీ ఆకారాన్ని చూస్తే కొంత భయమేయడం మాత్రం ఖాయమే. అలాంటి ఓ ఏనుగు ఇటీవల చేసిన ఓ పని మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఓ చిన్నారి పడేసుకున్న షూను ఏనుగు తొండంతో తీసి చేతికి అందించిన ఈ వీడియో వైరల్ గా మారింది. చైనాలోని షాంగ్ డోంగ్ ప్రావిన్స్ లోని ఓ జూలో ఇది జరిగింది.

చైనాలోని జూలో..
చైనాకు చెందిన ఓ ఫ్యామిలీ అంతా కలిసి జూకు వెళ్లారు. అలా జంతువులను చూస్తూ చూస్తూ ఏనుగులు ఉన్న ఎన్ క్లోజర్ వద్దకు వెళ్లారు. నేలకు దిగువన కాస్త లోతుగా తవ్విన గుంతలాంటి ఎన్ క్లోజర్ లో ఏనుగులు ఉన్నాయి. అంతా నిలబడి వాటిని చూస్తుండగా.. ఓ చిన్నారి షూ ఆ ఎన్ క్లోజర్ లో పడిపోయింది. అది గమనించిన ఏనుగు.. మెల్లగా తన తొండంతో షూను పట్టుకుని తీసి.. పైన నిలబడి చూస్తున్న వారికి అందజేసింది. ఆ షూను తీసుకున్న పిల్లలు.. కొంత గడ్డిని ఆ ఏనుగుకు ఇచ్చారు. ఏనుగు ఆ గడ్డిని తినేస్తూ వెనుదిరిగింది. దీనంతటినీ అక్కడున్న కొందరు వీడియో తీశారు. ట్విట్టర్ లో అప్ లోడ్ చేశారు. 

నెటిజన్ల ప్రశంసల వర్షం
ఏనుగు చిన్నారి షూను తీసిచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేల కొద్దీ వ్యూస్, లైకులు వస్తున్నాయి. ‘ఎవరో ఆ ఏనుగును సరిగా చూసుకుంటున్నారు, అందుకే పద్ధతిగా వ్యవహరిస్తోంది’ అని కొందరు కామెంట్ చేస్తే.. ‘ఈ ప్రపంచానికి ఏనుగులను ఇన్ చార్జులుగా పెడితే బాగుపడుతుంది..’ అని మరికొందరు ప్రశంసిస్తున్నారు.