స్మార్ట్ ఫోన్ల సంస్థ షియోమీ నుంచి హ్యూమనాయిడ్ రోబో.. సరికొత్త ఉదయం వైపు అంటూ వీడియో ఇదిగో

  • సరికొత్తగా ‘సైబర్ వన్’ రోబోను ఆవిష్కరించిన షియోమీ
  • ఐదు అడుగుల 9.7 అంగుళాల ఎత్తు.. 52 కిలోల బరువు
  • ఫోల్డబుల్ ఫోన్ ను విడుదల చేస్తూ రోబోనూ ఆవిష్కరించిన సీఈవో లీ జున్
  • రోబోకు సంబంధించి రెండు వీడియోలను విడుదల చేసిన షియోమీ
Xiaomi unveils humaoid robot CyberOne

మనిషిని పోలినట్టుగా ఉండే హ్యూమనాయిడ్ రోబోలు అనగానే.. హాలీవుడ్ సినిమాల్లోలా అయితే మనుషులకు సాయం చేస్తూ హీరోలుగా ఉండటమో, లేకుంటే మానవాళిపై ఆధిపత్యం కోసం ప్రయత్నించడమో చేసే రోబోలు గుర్తొస్తుంటాయి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలు అలాంటి హ్యూమనాయిడ్ రోబోలను రూపొందిస్తుండటం కూడా ఆసక్తికరంగా మారింది. టెస్లా సంస్థ ప్రతిష్ఠాత్మకంగా ‘ఆప్టిమస్’ రోబోను అభివృద్ధి చేస్తోంది. దానిని కొన్ని రోజుల్లో ఆవిష్కరించనుంది. అయితే దాని కన్నా ముందే చైనాకు చెందిన ప్రముఖ సెల్ ఫోన్ల సంస్థ షియోమి.. ‘సైబర్ వన్’ పేరుతో హ్యూమనాయిడ్ రోబోను ఆవిష్కరించింది. 

కుంగ్ ఫూ పోజులిస్తూ..
షియోమీ సంస్థ తాము రూపొందించిన ఫోల్డబుల్‌ ఫోన్‌ను విడుదల చేస్తూ.. పనిలో పనిగా తమ ‘సైబర్ వన్’ రోబోను ప్రదర్శించింది. షియోమీ సీఈవో లీ జున్‌ ‘సైబర్‌ వన్‌’ రోబోను స్టేజీపైకి పిలిచారు. చేతిలో పువ్వు పట్టుకుని మెల్లగా అడుగులో అడుగు వేస్తూ రోబో వచ్చింది. అందరికీ పరిచయం చేసుకొమ్మని లీ జున్ సూచించగానే.. ‘హాయ్ అయామ్ సైబర్ వన్’ అంటూ పరిచయం చేసుకుంది. 

తర్వాత పువ్వును లీ జున్ కు ఇచ్చి మగ గొంతుతో మాట్లాడింది. ఏం చేస్తూ ఉంటావని అడిగితే.. కుంగ్ ఫూ ప్రాక్టీస్‌ చేస్తుంటానని చెప్పింది. అదే పోజులో లీ జున్ తో సెల్ఫీ దిగింది. తర్వాత కుంగ్ ఫూ ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉందంటూ వెళ్లిపోయింది. షియోమీ సంస్థకు చెందిన రోబోటిక్స్‌ ల్యాబ్‌ అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా రోబో పనిచేస్తుందని లీ జున్ తెలిపారు. ఇది తమ తొలి అడుగు మాత్రమేనని.. భవిష్యత్తులో అద్భుత టెక్నాలజీలతో రోబోలను రూపొందిస్తామని పేర్కొన్నారు.

పడుతూ లేస్తూ.. కొత్త ఉదయం వైపు..
తమ రోబోను ఆవిష్కరించిన సందర్భంగా షియోమీ సంస్థ రెండు వీడియోలను విడుదల చేసింది. అందులో ‘సైబర్‌ వన్‌’కు సంబంధించిన ప్రత్యేకతలతో సరికొత్త ఉదయం వైపు సాగిపోతున్నది ఒకటి కాగా.. దాన్ని లీ జున్ ఆవిష్కరించినప్పటి వీడియో మరోటి. మొదటి వీడియోలో చిన్న పిల్లలు నడక నేర్చుకుంటున్నట్టుగా సైబర్ వన్ రోబో అడుగులో అడుగు వేస్తూ.. నడక నేర్చుకుని ఓ దారిలో సాగిపోతున్నట్టు ఉంటుంది. కొండలు, గుట్టలు, ఎడారిలో ఎండావాన, రాత్రీపగలు కొనసాగుతూ కొత్త ఉదయాన్ని చేరుకున్నట్టుగా చూపించారు.

రోబో ప్రత్యేకతలు ఏమిటి?
షియోమీ సంస్థ వెల్లడించిన వివరాల మేరకు.. ‘సైబర్‌వన్‌’ రోబో ఎత్తు ఐదు అడుగుల 9.7 అంగుళాలు. బరువు 52 కిలోలు. మన చుట్టూ ఉండే వాతావరణానికి సంబంధించి 85 రకాల ధ్వనులను గుర్తించగలదు. తన చుట్టూ ఉన్న వాతావరణం, పరిసరాలు, వస్తువులను త్రీడీ దృశ్యాలుగా మార్చుకుని చూడగలదు. అందుకు అనుగుణంగా తన నడకను మార్చుకోగలదు. ఇక మనుషులకు సంబంధించి సంతోషం, విషాదం వంటి 45 రకాల భావోద్వేగాలను గుర్తించగలదు. ఈ రోబో ధర సుమారు రూ.82.7 లక్షలు (లక్షా 4 వేల డాలర్లు).
  
  

More Telugu News