Marri Shashidhar Reddy: రేవంత్ రెడ్డి పార్టీకి నష్టం చేసే పనులు చేస్తున్నారు: మర్రి శశిధర్ రెడ్డి

Marri Shashidhar Reddy criticizes Revanth Reddy
  • ఇటీవల కాంగ్రెస్ ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రవణ్
  • రేవంత్ రెడ్డిపై సీనియర్ల ధ్వజం
  • ప్రస్తుత కల్లోలానికి రేవంతే కారణమన్న శశిధర్ రెడ్డి
  • రేవంత్ కు మాణికం ఠాగూర్ ఏజెంట్ అని విమర్శలు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ లో ప్రస్తుత కల్లోలభరిత వాతావరణానికి కారణం రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కలత చెందానని, తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో కాంగ్రెస్ లో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. కోమటిరెడ్డి సోదరులు వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి విషయంలో రేవంత్ వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు. 

రేవంత్ రెడ్డి పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్లను రేవంత్ అగౌరవపరుస్తుంటే హైకమాండ్ ఎందుకు మందలించలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి ఏజెంట్ గా మాణికం ఠాగూర్ (కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి) వ్యవహరిస్తున్నారని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ వంటి నేతలు కాంగ్రెస్ ను వీడిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

గాంధీ భవన్ కు సమాంతరంగా మరో ఆఫీసు నడుస్తోందని, టీపీసీసీ తీరుతో విసిగిపోయానని అన్నారు. డబ్బులిచ్చి టీపీసీసీ కొన్నారన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాదనను నమ్ముతున్నానని స్పష్టం చేశారు. మేం హోంగార్డుల్లా కనిపిస్తున్నామా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ చెప్పినవి నిజాలేనని పేర్కొన్నారు.
Marri Shashidhar Reddy
Revanth Reddy
Congress
Telangana

More Telugu News