China: శ్రీలంక పోర్టులో తమ గూఢచార నౌక మకాం వేయడంపై చైనా స్పందన ఇదే!

  • హంబన్ టోటా పోర్టులో బెర్త్ అయిన యువాన్ వాంగ్ 5
  • ఇది కేవలం రీసర్చ్ వెహికల్ మాత్రమే అన్న చైనా
  • ఏ దేశ భద్రతకూ విఘాతం కలిగించదని వ్యాఖ్య
  • అవసరమైన వాటిని నింపుకోవడానికి నౌకకు కొంత సమయం పడుతుందన్న చైనా
  • శ్రీలంక అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చేందుకు కొన్ని దేశాలు యత్నిస్తున్నాయని విమర్శ
Our Ship Docking At Lanka Port Doesnt Affect Any Country says China

శ్రీలంకలోని హంబన్ టోటా పోర్టులో చైనాకు చెందిన గూఢచార నౌక యువాన్ వాంగ్ 5 మకాం వేసిన సంగతి తెలిసిందే. భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ అది శ్రీలంకకు చేరుకుంది. భారత్ ప్రయోగించే మిసైళ్లను ట్రాక్ చేయడమే కాక, మహాసముద్రాలను కూడా ఈ నౌక సర్వే చేస్తుంది. అంతేకాదు జలాంతర్గాములకు తన వంతు సేవలను అందిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

మరోవైపు ఈ నౌక స్పై షిప్ కాదని... రీసర్చ్ వెహికల్ మాత్రమేనని చైనా అంటోంది. తమ హైటెక్ రీసర్చ్ వెస్సెల్ వల్ల ఏ దేశ భద్రతకూ విఘాతం కలగదని చెపుతోంది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ... శ్రీలంక సహకారంతో హంబన్ టోటా పోర్టులో యువాన్ వాంగ్ 5 బెర్త్ అయిందని చెప్పారు. హంబన్ టోటా పోర్టులో తమ నౌకకు శ్రీలంకలోని చైనా రాయబారి స్వాగతం పలికారని తెలిపారు. శ్రీలంకకు ఇచ్చిన అప్పులను జమ చేసుకునే ప్రక్రియలో ఈ పోర్టును చైనా 99 ఏళ్లకు లీజుకు తీసుకున్న సంగతి తెలిసిందే. 2017లో పోర్టును స్వాధీనం చేసుకుంది. 

మరోవైపు, అంతర్జాతీయ చట్టాలకు, నిబంధనలకు లోబడే యువాన్ వాంగ్ 5 నౌక మెరైన్ సైంటిఫిక్ రీసర్చ్ చేస్తుందని వాంగ్ వెన్బిన్ తెలిపారు. ఏ దేశ భద్రతను కానీ, ఆర్థిక కార్యకలాపాలకు కానీ విఘాతం కలిగించదని చెప్పారు. హంబన్ టోటా పోర్టులో అవసరమైన వాటిని నింపుకోవడానికి ఈ నౌకకు కొంత సమయం పడుతుందని తెలిపారు. 

తమ దేశానికి ఈ నౌకను పంపడాన్ని వాయిదా వేసుకోవాలని శ్రీలంక చెప్పింది కదా అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తల్లో నిజం లేదని అన్నారు. శ్రీలంక అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడానికి, ఆ దేశంపై ఒత్తిడి తెచ్చేందుకు కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని పరోక్షంగా భారత్ పై విమర్శలు గుప్పించారు. 

మరోవైపు చైనా మీడియా కథనాల ప్రకారం ఈ నౌకలో 2 వేల మంది సిబ్బంది పని చేస్తుంటారు. శాటిలైట్లను, ఖండాతర క్షిపణులను ఇది తనలో ఉన్న ఆధునిక వ్యవస్థలతో ట్రాక్ చేస్తుంది.

More Telugu News