Cadbury chocolates: లక్నోలో రూ.17 లక్షల క్యాడ్ బరీ చాక్లెట్ల చోరీ

Cadbury chocolates worth Rs17 lakh stolen from Lucknow godown
  • చిన్హాట్ ప్రాంతంలో గోదాములో ఉంచిన 150 కార్టాన్లు ఖాళీ
  • సీసీటీవీ కెమెరాలను సైతం తీసుకెళ్లిన దొంగలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన క్యాడ్ బరీ పంపిణీదారు
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో పెద్ద మొత్తంలో చాక్లెట్ల చోరీ జరిగింది. దొంగలు ఏకంగా  150 కార్టాన్ల క్యాడ్ బరీ చాక్లెట్లను ఎత్తుకుపోయారు. వీటి విలువ రూ.17 లక్షలు ఉంటుంది. లక్నోలోని చిన్హాట్ ప్రాంతంలో ఓ గోదాములోకి చొరబడి ఈ పనిచేశారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ చోరీ జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. 

దీనిపై క్యాడ్ బరీ ఉత్పత్తుల పంపిణీదారు రాజేంద్ర సింగ్ సిద్ధూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్హాట్ ప్రాంతం నుంచి అతడు తన వ్యాపార కార్యకలాపాలను ఇటీవలే గోమతి నగర్ లోని అపార్ట్ మెంట్ కు మార్చాడు. అయినప్పటికీ చిన్హాట్ లోని ఇంటిని చాక్లెట్ల నిల్వకు గోదాముగా వినియోగించుకుంటున్నట్టు చెప్పాడు. 

మంగళవారం ఉదయం తలుపులు తెరిచి ఉన్నట్టు రాజేంద్ర సింగ్ కు పొరుగు వారి నుంచి కాల్ వచ్చింది. దాంతో చిన్హాట్ లోని మాజీ ఇంటికి వెళ్లి చూడగా, లోపల చాక్లెట్ల కార్టాన్లు కనిపించలేదు. సీసీటీవీ కెమెరాలను కూడా దొంగలు తమతోపాటు తీసుకుపోయినట్టు అతడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. రాత్రి వేళ ట్రక్ వచ్చి రాజేంద్ర సింగ్ గోదాము నుంచి చాక్లెట్ల డబ్బాలను లోడ్ చేసుకుంటున్న విషయాన్ని స్థానికులు గమనించారు. కానీ, అది రాజేంద్ర సింగ్ చేయించుకుంటున్నట్టు వారు భావించడంతో దొంగల పని సులువు అయింది.
Cadbury chocolates
stolen
Lucknow
godown

More Telugu News